టీఆర్ఎస్ లో మరో అసంతృప్తి నేత పార్టీ అధిష్టానంపై మండిపడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఆస్తులు అమ్ముకున్నానని, అయినా టిక్కెట్‌ ఇవ్వకుండా పార్టీ పెద్దలు మూడు పర్యాయాలుగా అన్యాయం చేస్తూ వస్తున్నారని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌ ఆరోపించారు. శుక్ర వారం మండలంలోని చెట్లచెన్నారం, చినమాదారం, తొరగల్‌ గ్రామాల్లో ఆయన పర్యటించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మూడు పర్యాయాలుగా టిక్కెట్‌ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోవడం అన్యాయమంటున్నా పెద్దలు న్యాయమెందుకు చేయడం లేదని పేర్కొన్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

టిక్కెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలవడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వద్దని కేసులు పెట్టించిన వారికి టిక్కెట్‌ ఇవ్వడంతో ఉద్యమ కారులు ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు.