తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుని పేరుతో ఈ ప్రకటనజారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుని పేరుతో ఈ ప్రకటనజారీ చేసింది. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తున్నట్టుగా ప్రకటనలో పేర్కొంది. ప్రతిపాదిస్తున్న కొత్త పేరు బీఆర్ఎస్‌పై ఎవరికైనా అభ్యంతరం ఉంటే కేంద్ర ఎన్నికల సంఘానికి నెల రోజుల్లోగా పంపాలని తెలిపింది.
‘‘సాధారణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీ అనగా తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రధాన కార్యాలయం: తెలంగాణ భవన్, రోడ్ నం.10, బంజారాహిల్స్, హైదరాబాద్-34, దాని పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చుటకు ప్రతిపాదిస్తున్నది. ప్రతిపాదిస్తున్న కొత్త పేరుపట్ల ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే వాటికిగల కారణాలతో తమ అభ్యంతరమును సెక్రటరీ (పొలిటికల్ పార్టీ), ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోకా రోడ్, న్యూఢిల్లీ-110001కి ప్రచురణ నుంచి 30 రోజులలోగా పంపవలెను’’ అని టీఆర్ఎస్ ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో వరుసగా రెండు సార్లు టీఆర్ఎస్ అధికారాన్ని దక్కించుకుంది. అయితే కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి మార్చుతూ నిర్ణయం తీసుకన్నారు. ఈ ఏడాది దసరా రోజున తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాలని తీర్మానించారు. బీఆర్ఎస్ కేసీఆర్ జాతీయ ఆశయాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని కూడా మార్చారు.
టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చడానికి అనుమతిస్తూ ఆమోదించిన తీర్మానం కాపీ, సంబంధిత పత్రాలను టీఆర్ఎస్ ప్రతినిధులు న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమర్పించారు. అయితే పార్టీ గుర్తు కారులో ఎలాంటి మార్పు ఉండదని.. అదే విధంగా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
