కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే బహిరంగ చర్చ మాత్రం ఉత్త ముచ్చటే అయ్యేలా ఉంది. ఎందుకంటే బహిరంగ చర్చ విషయంలో అధికార టిఆర్ఎస్ షాకింగ్ మెలిక పెట్టింది. బహిరంగ చర్చకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి మాత్రమే వస్తే తాము బహిరంగ చర్చలో పాల్గొంటామని అధికార పార్టీ స్పష్టం చేసింది. రేవంత్ తో చర్చలు జరిపితే నెగ్గలేమనుకున్నారో ఏమో కానీ.. రేవంత్ తో చర్చలకు మాత్రం తాము దూరమని ప్రకటించింది. రేవంత్ విసిరిన సవాల్ ను స్వీకరించి తర్వాత రేవంత్ లేకుండా చర్చలైతేనే మేము సిద్ధం అని టిఆర్ఎస్ ప్రకటించచింది. పనిలో పనిగా రేవంత్ రెడ్డి పై మరోమారు తిట్ల వర్షం కురిపించింది టిఆర్ఎస్. 

కరెంటు విషయంలో తెలంగాణ సర్కారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని పలు ఇంటర్నేషనల్ పత్రికలకు యాడ్స్ ఇచ్చుకుంది. 24 గంటల కరెంటు రైతాంగానికి వరం అంటూ పత్రికల్లో జోరుగా ప్రచారం చేసుకుంది. ఈ విషయంలో రేవంత్ కౌంటర్ ఎటాక్ షురూ చేశారు. పచ్చి మోసం చేస్తున్నారని, 24 గంటల కరెంటు దోపిడీకి పరాకాష్ట అని రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

దీనిపై టిఆర్ఎస్ అంతే స్థాయిలో స్పందించింది. టిఆర్ఎస్ ఎంపి బాల్క సుమన్ రేవంత్ బహిరంగ చర్చకు వస్తామని రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. దీనికి వెంటనే రేవంత్ స్పందించారు. బాల్క సుమన్, ఎమ్మెలసీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. టిఆర్ఎస్ వైపు నుంచి ఎవరొచ్చినా.. చర్చకు సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి తనతోపాటు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవన్, అలంపూర్ ఎమ్మెల్యే సంతప్ కుమార్ చర్చకు వస్తామని ప్రకటించారు.

దీనిపై టిఆర్ఎస్ స్పందించింది. బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ కు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయనతో చర్చకు తాము దూరమని ప్రకటించారు. కుక్కమూతి పిందె లాంటి వ్యక్తి రేవంత్ కాబట్టి ఆయనతో చర్చకు తాము సిద్ధం కాదన్నారు. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు, దొరికిన దొంగ అంటూ తిట్ల వర్షం కురిపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి లాంటి వాళ్లతో అయితేనే చర్చకు సిద్ధమన్నారు. నిన్నటి వరకు టిడిపిలో ఉండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్, నిన్నటిదాకా టిఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన ఇంకో నేతతో తాము చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు.

రేవంత్ రెడ్డి నిన్నటివరకు తాను రాజీనామా చేశానని చెప్పుకున్నారని.. నిజంగా రేవంత్ కు దమ్ముంటే నిజమైన రాజీనామా చేయాలని సవాల్ చేశారు. విలువలు, విశ్వసనీయత లేని రేవంత్ తో చర్చలు జరిపి తమ గౌరవాన్ని పోగొట్టుకోలేమన్నారు. అసెంబ్లీ సాక్షిగా గతంలో రేవంత్ రెడ్డి ఎంపి కవితకు రెండు ఓట్లు ఉన్నాయని పచ్చి అబద్ధాలు మాట్లాడినట్లు ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో దొరికి జైలుకు పోయిన దొంగతో తాము చర్చలు జరపబోమన్నారు. ఆ నలుగురు వస్తేనే టిఆర్ఎస్ నుంచి చర్చకు వస్తామన్నారు.

మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేనున్నా అంటే ఆయన కూడా చర్చకు సిద్ధమని ప్రకటించారని. అసలు కాంగ్రెస్ పార్టీలో చర్చకొచ్చేవారెవరో చెప్పాలన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కూడా మాట్లాడారు.