తెలంగాణ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భూ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఆయన హుజూరాబాద్ కు వెళ్లి అనుచరులను కలవడం, మీటింగ్ లు ఏర్పాటు చేస్తుండడంతో అధిష్టానం మరింత సీరియస్ అవుతోంది. 

మరోవైపు ఈటలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్ లు పెట్టి తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని కూడా జిల్లా నేతలు యోచిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈటెలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హై కమాండ్ కు కరీంనగర్ జిల్ల నేతలు లేఖ ఇచ్చారు. 

హుజురాబాదులో ఈటెలకు చెక్: పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ నేతల గాలం...

ఇదిలా ఉండగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్  భార్య  జమున పేరిట  నిర్మించిన గోదాముల్లో ఎలాంటి అనుమతులు లేవని  ఏసీబీ, విజిలెన్స్ అధికారులు గుర్తించారు.శామీర్‌పేట మండలం దేవరయంజాల్ శ్రీసీతారామస్వామి దేవాలయ భూముల్లో 219 గోదాములు నిర్మించారు. వీటిల్లో మూడు గోడౌన్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయని అధికారులు గుర్తించారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున  పేరున 6.28 ఎకరాల్లో గోడౌన్లు నిర్మించినట్టుగా  అధికారులు గుర్తించారు.

ఈ గోడౌన్లకు ఎంత అద్దె చెల్లిస్తున్నారు, ఖాళీ స్థలం ఎంత ఉంది అనే విషయాలపై కూడ  అధికారులు వివరాలు సేకరించారు.ఏసీబీ, విజిలెన్స్ అధికారులు  మూడు రోజులుగా ఈ భూముల్లో విచారణ నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయితీగా ఉన్న సమయంలో కొందరు రాజకీయనాయకులు ఈ భూముల్లో గోడౌన్లు నిర్మించి పలు సంస్థలకు అద్దెకిచ్చారని గుర్తించారు.అనుమతులు లేకుండా నిర్మించిన ఈ గోడౌన్లకు మున్పిపాలిటీ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై విజిలెన్స్, ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  భూములను ఆక్రమరించారనే ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు.