ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వికారాబాద్‌ టీఆర్ఎస్‌లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ పంచాయితీ ప్రగతిభవన్‌కు చేరింది.

వికారాబాద్ టీఆర్‌ఎస్‌ పంచాయితీ ప్రగతి భవన్‌కు చేరింది. ఇటీవల వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి వాహనంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు ఎమ్మెల్యే ఆనంద్ కారణమని సునీతా మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే వికారాబాద్‌ టీఆర్ఎస్‌లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. రెండు వర్గాలను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి భవన్‌కు పిలిచారు. 

ఇక, సునీతా మహేందర్‌ రెడ్డిపై కొందరు వ్యక్తులు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డప్పటికీ.. ఆమెకు కేటాయించిన అధికారిక వాహనం ధ్వంసమైంది. మర్పల్లిలో ఓ ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్‌ ఎస్పీ ఎన్‌ కోటిరెడ్డి తెలిపారు.

కాగా, దాడికి పాల్పడింది టీఆర్‌ఎస్ కార్యకర్తలు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అనుచరులని సునీతా మహేందర్ రెడ్డి ఆరోపించారు. ‘‘పర్యటన సమయంలో కార్యక్రమం సజావుగా జరిగేలా చూసుకోవడం స్థానిక పరిపాలన, పోలీసుల బాధ్యత. అయితే దాడి సమయంలో వారెవరూ మా రక్షణకు రాలేదు. స్థానిక సీఐ, ఎస్‌ఐలు కూడా ప్రేక్షక పాత్ర పోషించారు. వీరిని ఎమ్మెల్యే బదిలీ చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి రక్షణ కోరుతాం’’ అని సునీతా మహేందర్ రెడ్డి చెప్పారు. ఇక, కొంతకాలంగా వికారాబాద్ టీఆర్ఎస్‌లో వర్గపోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.