మునుగోడు ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నల్గొండ ప్రజలకు ఫ్లోరోసిస్ శాపంగా ఇచ్చింది కాంగ్రెస్ అని, స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసా ఇవ్వలేదని తెలిపారు. కానీ, మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యకు టీఆర్ఎస్ శాశ్వత పరిష్కారం చూపిందని వివరించారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ మునుగోడు ఉప ఎన్నిక గురించి కీలక ట్వీట్ చేశారు. మునుగోడులో జరగనున్న ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ అంటూ ఆయనే ప్రశ్నించారు. అదే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. టీఆర్ఎస్ ఘనతను వివరించారు. ఈ సందర్భంగా నల్గొండను పీడించిన ఫ్లోరోసిస్ భూతాన్ని ప్రస్తావించారు.

ఫ్లోరోసిస్ భూతాన్ని నల్గొండ బిడ్డలకు శాపంగా కాంగ్రెస్సే ఇచ్చిందని ఆరోపించారు. ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం నీతి అయోగ్ సిఫార్సు చేసినప్పటికీ మిషన్ భగీరథకు మానవత్వం లేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అదే టీఆర్ఎస్ మాత్రం.. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ నుంచి శాశ్వత విముక్తి ప్రసాదించిందని వివరించారు.

Scroll to load tweet…

అంతేకాదు, అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేశారు. ఓ చిత్రాన్ని ఆయన మరో ట్వీట్‌లో జోడించారు. ప్రధానమంత్రి టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం అది అని వివరించారు. అప్పటి ఫ్లోరోసిస్ దుస్థితికి ఈ చిత్రమే నిదర్శనం అని తెలిపారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ, బాధితులు స్వయంగా ప్రధానమంత్రికి మొరపెట్టుకున్నా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ఆ సమస్యను పరిష్కరించనేలేదని పేర్కొన్నారు. 

అదే తెరాస ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను శాశ్వతంగా తీర్చిన మాట వాస్తవమే అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా తెలిపిందని వివరించారు.