జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా  పావులు కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా మరింత వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌ పార్టీలో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. 

జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా మరింత వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌ పార్టీలో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తన కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అధ్యక్షురాలిగా నియమించారు. ఇప్పటికే కేసీఆర్ జాతీయ స్థాయిలో పలు పార్టీల నేతలతో జరుపుతున్న చర్చల సందర్భంగా, ఢిల్లీ పర్యటనల సందర్భంగా.. కవిత కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ కమిటీ జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ వ్యవహారాలపై దృష్టి సారించనున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా తమతో కలిసి వచ్చే పార్టీలతో టీఆర్ఎస్ జరిపే చర్చల్లో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనుందని సమాచారం. గతంలో ఎంపీగా పనిచేసిన కవితకు.. వివిధ పార్టీలకు చెందిన నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. 

మరోవైపు నేడు జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో జాతీయ రాజకీయాలే కేంద్ర బిందువుగా నిలవనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయడంతో పాటుగా.. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పాత్రపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ప్లీనరీలో మొత్తం 13 తీర్మానాలను పెట్టి ఆమోదించనున్నారు. అందులో జాతీయ రాజకీయాలపైన కూడా తీర్మానం ఉంది. దేశ విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక భూమిక పోషించాలని మంత్రి కేటీఆర్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.