తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనేక గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. అయితే ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం ఈ ఎన్నికల ద్వారా సొంత గ్రామంలో షాక్ తగిలింది. ఆయన పుట్టి పెరిగిన గ్రామంలోనే టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు. ఇలా ఎమ్మెల్యేగా రచ్చ గెలిచినా సర్పంచ్ ని గెలిపించుకోలేక ఎమ్మెల్యే ఇంట ఓడిపోయారు.

ఈ విచిత్ర అనుభవం కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు కలిగింది. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కరివిరాల ఎమ్మెల్యే స్వగ్రామం. అక్కడ మొదటి విడతలో భాగంగా సోమవారం సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో గ్రామస్ధులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్చునిచ్చారు. టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధి రణబోతు రమాదేవిపై కాంగ్రెస్ అభ్యర్థి నీలిమా గాంధీ 17 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 

గ్రామంలో మొత్తం 1265 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థికి 626 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 609 ఓట్లు వచ్చాయి. 22 ఓట్లు చెల్లకపోగా 2 నోటాకు పడ్డాయి. ఇలా సొంత గ్రామంలోనే మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోలేక పోవడం చర్చనీయాంశంగా మారింది. 

అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ మాజీ  ఎమ్మెల్యే, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ భార్య పద్మవతి రెడ్డి వంటి గట్టి నాయకురాలిని మల్లయ్య యాదవ్ ఓడించారు. చివరి నిమిషంలో మల్లయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసి  చివరకు విజయం సాధించాడు. అయితే ఇలా పట్టుదలతో నియోజకవర్గ ప్రజల మెప్పు పొందిన వ్యక్తి సొంత గ్రామస్తులను మెప్పించలేకపోయారు.  కారణాలేవైనా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ను గెలిపించుకోలేకపోవడంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.