తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేపట్టిన ప్రచారం ఉద్రిక్తంగా మారింది. ఆయన ప్రచారానికి అడ్డుతగులుతూ నిరసన తెలిపిన గ్రామస్థులపై టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కొత్తగూడెం నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ వెంకటేశ్వర్లుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే అప్పడినుండి ఈయన  నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన చుండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో ప్రచారానికి వెళ్లారు. అయితే ఆయన్ని అడ్డుకున్న గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

పదవిలో ఉన్నపుడు గ్రామంలోని సమస్యల గురించి పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీశారు. ఇప్పుడు కూడా కేవలం ఓట్ల కోసమే వచ్చారని పేర్కొంటూ వెంకటుశ్వర్లు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు,మాజీ ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులను సముదాయించడానికి ప్రయత్నించారు. గ్రామస్తులు వినకపోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు ఎమ్మెల్యే ముందే గ్రామస్థులను దాడికి పాల్పడ్డారు. 

 వెంకటేశ్వర్లు దాడికి పాల్పడుతన్న వారిని సముదాయించడానికి ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను ఆపి ఇరు వర్గాలను చెదరగొట్టారు.