2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి కాంగ్రెసు, తెలుగుదేశం, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు క్యూ కట్టారు. ఒక రకంగా టిఆర్ఎస్ వలస నేతలతో క్రిక్కిరిసిపోయింది.
హైదరాబాద్: పైకి అంతా సజావుగా కనిపిస్తున్నప్పటికీ గులాబీ గూడు చెదురుతున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల వేళ అసంతృప్తులు, అసమ్మతులు పెచ్చరిల్లి పార్టీ నుంచి వీడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. టికెట్లు అశించి భంగపడినవారు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు.
2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి కాంగ్రెసు, తెలుగుదేశం, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు క్యూ కట్టారు. ఒక రకంగా టిఆర్ఎస్ వలస నేతలతో క్రిక్కిరిసిపోయింది.
టీఆర్ఎస్ లో చేరినవారిలో చాలా మంది సీనియర్ నాయకులున్నారు. ఇద్దరు ఎంపీలతో పాటు 30 మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. ఈ స్థితిలో సీనియర్ నాయకులకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేకపోయారు. అదే సమయంలో శాసనసభ సీట్ల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. బహుశా, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా చాలామందికి టికెట్లు ఇవ్వవచ్చునని కేసిఆర్ భావించి ఉంటారు.
అయితే, కేసిఆర్ ముందస్తు వెళ్లే సాహసం చేయడంతో పాటు 105 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఐదుగురికి తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఖరారు చేశారు. దాంతో ఒక్కసారిగా అసమ్మతి పెల్లుబుకింది.
ఎమ్మెల్సీలు కొండా మురళీ, భూపతి రెడ్డి వంటివాళ్లు కాంగ్రెసులోకి వలస వెళ్లారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడడంతో పార్టీయే ఆయన్ని సస్పెండ్ చేసింది. జి. వినోద్ కూడా పార్టీ వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కూడా పార్టీలో ఉండకపోవచ్చు.
కొండా సురేఖ, సుమన్ రాథోడ్, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాంగ్రెసులో చేరారు. తాము కచ్చితంగా వంద సీట్లు గెలుస్తామని కేసిఆర్ చెబుతున్నప్పటికీ ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడుతుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
