దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ కేసీఆర్ నిరహార దీక్షకు నేటితో ఏడేళ్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక కార్యక్రమాలు
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష.. తెలంగాణ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన ఘట్టం... ఏడేళ్ల కిందట కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ అమరణ నిరహార దీక్షకు సిద్ధమైన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఈ తేదీ నుంచే పతాక స్థాయికి తీసుకొచ్చారు. దీన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ‘దీక్షా దివస్’ కార్యక్రమం మంగళవారం టీఆర్ ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫిసెర్ జయశంకర్ చిత్రపటానికి ఎంపీలు కేకే, కె కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, సీతారాం నాయక్, సుమన్‌లతో పాటు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్షకు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయని నేతలు గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ దీక్ష బంగారు తెలంగాణకు నాంది పలికిందన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే సీఎం కేసీఆర్ పోరాటమన్నారు. ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. రాబోయే 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటదని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే, హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు హాజరయ్యారు. ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారని నాయిని గుర్తు చేశారు. పేదల అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.
