టీఆర్ఎస్ పార్టీ... మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కి షాకిచ్చింది. తెలంగాణ ఎన్నికలపై లగడపాటి సర్వే చేయించిన సంగతి తెలిసిందే. ఇటీవల లగడపాటి తెలంగాణలో 10 మంది దాకా స్వతంత్రులు గెలవబోతున్నారని ప్రకటించడాన్ని టీఆర్ఎస్ తప్పుపట్టింది.

ఈ నేపథ్యంలో లగడపాటిపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. వారంలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసేలా ఈ ప్రకటన ఉన్నదని, సర్వే వివరాలు ప్రకటించటం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమన్వయ కమిటీ తరఫున దండె విఠల్‌ ఫిర్యాదుచేశారు. తిరుపతిలో లగడపాటి చేసిన ప్రకటనను టీవీల్లో ప్రసారం చేశారని.. ఇలాంటి ప్రకటన ఈ సమయంలో సరైంది కాదని పేర్కొన్నారు. రోజుకు ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. 

ఇదిలా ఉండగా.. టీడీపీ నేతలు టీ న్యూస్ ఛానల్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు.  చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా టీన్యూస్‌ చానల్‌ కథనాలు ప్రసారం చేసిందని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. సదరు చానల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈసీని టీడీపీ-టీస్‌ ప్రధాన కార్యదర్శి జి.బుచ్చిలింగం, అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్‌ కోరారు.