హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించారు. ప్రగతి భవన్ లో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమైన కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రతీ ఎమ్మెల్యే అభ్యర్థి శుక్రవారం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. 

తాను అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థులకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్ వచ్చిందని గర్వ పడకుండా అందర్నీ కలుపుకు పోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో అసంతృప్తులు ఉంటే బుజ్జగించుకోవాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులదేనని తేల్చి చెప్పారు. 

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే మనల్ని గెలిపిస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని దాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలన్నారు. మళ్లీ 15 రోజుల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో సమీక్షసమావేశం నిర్వహిస్తానని తెలిపారు.