గద్వాల: గట్టు లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం అమలు చెయ్యడం లేదని తెలిపారు.
  
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ ఉండదన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆయన కళ్లుభైర్లు కమ్మేలా 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. 

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కళ్యాణ లక్ష్మీపథకం ప్రవేశపెట్టామన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఏ ప్రభుత్వమైన లక్ష 116 రూపాయలు ఇస్తుందా అంటూ నిలదీశారు. ఇలాంటి పథకాలను కాంగ్రెస్, టీడీపీలు జన్మలో కూడా ఇవ్వలేవన్నారు. 

ఆసరా పెన్షన్లు రూ.1000 నుంచి రూ.2016కి పెంచినట్లు తెలిపారు. అలాగే నిరుద్యోగ భృతి రూ.3016 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అమ్మఒడి పథకం పేరుతో గర్భిణీ స్త్రీలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 

కంటి అద్దాల వరకే వదిలిపెట్టమని ఈఎన్.టి డాక్టర్ల బృందం కూడా త్వరలో వస్తాదని ఆ తర్వాత డెంటల్ డాక్టర్లు వచ్చి అన్ని పరీక్షలు చేస్తారని తెలిపారు. పెథలాజికల్ బృందం వచ్చి రక్త నమూనా సేకరించి ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణయే తన లక్ష్యమన్నారు. 

రైతు బంధు, రైతు భీమా స్కీమ్ దేశంలోనే ఎక్కడా లేదని ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం  కింద రైతులకు ఇస్తున్న రూ.8000ను పది వేలుకు పెంచుతున్నట్లు తెలిపారు. రైతు సహజంగా చనిపోయినా రూ.5లక్షలు అందించి వారిని ఆదుకుంటున్నట్లు తెలిపారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపై కేసీఆర్ మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన 73 ఏళ్ల తర్వాత కూడా పచ్చి అబద్దాలు మాట్లాడే ప్రధాన మంత్రులు ఉండటం దురదృష్టకరమన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తుంటే మోదీ కరెంట్ లేదని చెప్తాడని మండిపడ్డారు. నిజమాబాద్ ఉండండి మోదీగారు కరెంట్ ఉందో లేదో చూపిస్తా అంటూ దాడిపోయాడన్నారు. ప్రధాని మంత్రి ఇలా అబద్ధాలు నీచాలు మాట్లాడటం బాధాకరమన్నారు.  

ఉన్న తెలంగాణను ఓడగట్టిందే కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణను ముంచుతుంటే మూసుకుని కుర్చుంది కాంగ్రెస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు. 1974 జూరాల ప్రాజెక్టును పేరుకే నిర్మించారని తెలిపారు. ఆ ప్రాజెక్టును నీటితో నింపకుండా పోరంబోకు ప్రాజెక్టుగా మార్చేశారని ఆరోపించారు. 

2001లో గులాబీ జెండా ఎగురవేసిన తర్వాత చంద్రబాబును నిలదీశానన్నారు. తాను గద్వాలలో పాదయాత్ర చేసి కర్ణాటక భూ నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వవని ప్రశ్నిస్తే అప్పుడు జూరాల ప్రాజెక్టు పూర్తి చేశారని నీరు నింపారని గుర్తు చేశారు.  

1974లో జూరాల నిర్మిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు నీళ్లు నింపలేదన్నారు. ఆర్డీఎస్ నాశనం పట్టిందే కాంగ్రెస్ వాళ్ల వళ్ల అంటూ మండిపడ్డారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు వల్ల ఆలంపూర్ మునిగితే కాంగ్రెస్ వాళ్లు నోరు విప్పారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కష్టపడి ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గట్టు ఎత్తిపోతల పథకం కావాలని కోరితే తానే ఇచ్చి దానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. వీలైనంత త్వరలో గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 38వేల ఎకరాలకు సాగునీరందిస్తానని హామీ ఇచ్చారు. 

అలాగే తాగు నీటి సమస్య కూడా ఉందని ఆ సమస్యను కూడా తీరుస్తానని ప్రకటించారు. నెత్తిమీద జూరాల ఉంటుంది కానీ తాగేందుకు నీరు ఉండదన్నారు. వేలం పాడు రిజర్వాయర్ ను 2 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పెంచితే లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించింది టీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. 

గద్వాల చైతన్యవంతమైన ప్రాంతమని ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఇప్పటి దాకా మోసపోయింది చాలన్నారు. ఎంతకాలం పాత చింతకాయ పచ్చడి తింటారు కొత్తవాళ్లను రానీయోద్దా అంటూ చెప్పుకొచ్చారు. చద్దితిన్నకాడ రేవు తలవాలే అంటారు. ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞత భావం ఉండాలి అని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే గద్వాల జిల్లా ఏర్పడేదా అంటూ ప్రశ్నించారు. గద్వాల జిల్లా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా లక్ష ఓట్లతో కృష్ణమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఇకపోతే గట్టు ఎత్తిపోతల పథకం ఆరునెలలు ఆలస్యం అవుతుందని అయినా రిజర్వాయర్ సామర్థ్యం పెంచి గట్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ  ఓట్లు అడగనన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ పూర్తి చేశామని త్వరలోనే ఇంటింటికి నల్లా నీరు అందిస్తానన్నారు. అలాగే కేసీఆర్ బతికి ఉన్నంత వరకు, ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, ఎకరానికి 10 వేలు రైతు బంధు, ఎరువులు అందజేసే బాధ్యత నాదేనన్నారు. 

అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఫుడ్ ప్రోసెషింగ్ యూనిట్ లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఐకేపీలో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కృష్ణ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని కోరారు.