Asianet News TeluguAsianet News Telugu

గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసి విజయగర్జన సభకు తరలిరండి: కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, విజయగర్జన సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాల్గొనాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. వారి వారి గ్రామాల్లో పార్టీ జెండా ఎగరేసి సభకు వాహనాల్లో తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
 

trs became invincible in telangana says KTR
Author
Hyderabad, First Published Oct 21, 2021, 6:47 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో TRS పార్టీ తెలంగాణలో ఎదురులేని శక్తిగా ఎదిగిందని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభ ఏర్పాటు సమావేశం జరిగింది. మెదక్, అందోల్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ తీరుతెన్నులు, అజేయశక్తిగా పార్టీని నిలుపడంలో అధినేత కేసీఆర్ కృషిని గుర్తుచేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున విజయ గర్జన సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ జెండా ఎగరేసి తరలిరావాలని సూచించారు.

రెండు దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో కార్యకర్తలు గులాబి జెండాను భుజాలపై మోస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా KCR అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని చెప్పారు. ఈ పథకాలతో ప్రజలను పార్టీకి మరింత దగ్గరకు చేశారని వివరించారు. సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మార్గదర్శకంగా ఎదిగిందన్నారు. 

Also Read: సీఎం కేసీఆర్‌పై 30శాతం ఓటర్ల ఆగ్రహం.. కేటీఆర్‌కు బాధ్యతలు ఇవ్వడం బెటర్: సర్వే

సమైక్యాంధ్రలో తెలంగాణకు నోరు, నీరు లేదని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆ తర్వాతే తెలంగాణ ప్రజలకు గౌరవం దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాదరణతో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని వివరించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 105 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడం గొప్ప విషయమన్నారు. 32 జిల్లా పరిషత్తులకు 32 గెలుపొంది టీఆర్ఎస్ దాని పనితీరును నిరూపించుకుందని వివరించారు. మెదక్ నియోజకవర్గంలో 145 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలలో 44 వార్డుల నుండి విజయగర్జన సభకు ప్రజలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆందోల్ నియోజకవర్గంలో 200 గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలోని 23 వార్డుల నుంచి ప్రజలు రావాలన్నారు. ప్రతి యూనిట్ నుండి వాహనాలపై సభకు రావాలని సూచించారు. Vijayagarjana sabhaకు బయల్దేరే ముందు వారివారి గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించాలని చెప్పారు.

ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, యంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్, ఆందోల్ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు సోములు, ఎలక్షన్ రెడ్డి, జడ్పీటీసీలు, యంపీపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios