Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రెబెల్స్ కు గిరాకీ: ఇరు పక్షాలు పోటాపోటీగా...

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలంపై అప్పుడే అంచనాలు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఇవ్వడంతో ఆ పార్టీ ఖుషీగా ఉంది. 

TRS and Congress wooing rebels in advance
Author
Hyderabad, First Published Dec 10, 2018, 4:12 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలంపై అప్పుడే అంచనాలు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఇవ్వడంతో ఆ పార్టీ ఖుషీగా ఉంది. 
అయితే ఆంధ్రాఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన సర్వే ప్రజాకూటమికి ఊపునిచ్చింది. జాతీయ మీడియా సంస్థల ఫలితాలతో మాంచి హుషారుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి లగడపాటి ఎగ్జిట్ పోల్ మింగుడపడలేదు. జాతీయ మీడియా సంస్థల సర్వేలు అటూ ఇటూ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక వేళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అటు ఇటు అయినా, ఇటు అటు అయినా ఏదైనా స్వతంత్రులను కలుపుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థులకు బరిలోకి దిగిన వారిని టార్గెట్ చేస్తూ తమకే మద్దతు ఇవ్వాలంటూ ఫోన్లు చేయిస్తోంది.  

అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం అలర్ట్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడినా, లేకపోతే దగ్గరకు వచ్చి ఆగిపోయినా, తక్కువ ఫలితాలు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా వేటిని వదలకుండా ఉండేందుకు వ్యూహ రచన చేస్తోంది. 

అందులో భాగంగా కర్ణాటక తరహా ఫార్ములాను ఏపీలో ప్రయోగించేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్రపోషించిన ఆ పార్టీ కీలక నేత మంత్రి డీకే శివకుమార్ ను రంగంలోకి దింపింది కాంగ్రెస్ అధిష్టానం.

ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. డీకే శివకుమార్ తోపాటు ఏఐసీసీ నేతలు సైతం సోమవారం సాయంత్రం లోగా తెలంగాణకు రానున్నారు. శివకుమార్ కు తెలంగాణ వ్యూహ రచన బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఇప్పటికే తన వ్యూహాలకు పదును పెట్టారు. 

కాంగ్రెస్ రెబల్ తో సంప్రదింపులు జరపాలని డీకే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురికి సూచించారు. ఈ నేపథ్యంలో వారంతా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులను తమవైపుకి తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. 

ఇప్పటికే ఇబ్రహీంపట్నం స్వతంత్ర అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గెలుస్తారని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలకు ఒక్కరోజుముందే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో సంప్రదింపులు జరిపారు. మల్ రెడ్డి రంగారెడ్డికే  కాంగ్రెస్ మద్దతు అంటూ ప్రకటించారు. 

వీరితోపాటు వివిధ ప్రాంతాల్లో పోటీ చేసిన రెబల్స్ తోనూ కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి వెళ్తోంది. తమకు మద్దతు ప్రకటించాలంటూ కోరుతోంది. ముఖ్యంగా గెలిచే స్వతంత్ర అభ్యర్థులకు అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఫోన్లు రావడంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ రెబల్, స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి, టీఆర్ఎస్ రెబల్ జి. వినోద్, నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, బోథ్ లో అనిల్ కుమార్ జాదవ్ విజయం సాధిస్తారని గడపాటి చెప్పడంతో వీరిని ఇరు పార్టీలు టార్గెట్ చేశాయి.  

ఇకపోతే బలమైన స్వతంత్ర అభ్యర్థులను సైతం ఇరు పార్టీలు టార్గెట్ చేశాయి. గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పలువురు నేతలను గుర్తించిన ఇరు పార్టీలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్ల సమాచారం. 

పార్టీలతో సంబంధం లేకుండా ఇరు పార్టీలు అభ్యర్థలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నూరు నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనార్దన్, వైరా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ రెబల్ రాములు నాయక్, జూబ్లీహిల్స్ మజ్లిస్ తిరుగుబాటు అభ్యర్థి నవీన్ యాదవ్ లపై ఇరు పార్టీలు కన్నేసినట్లు తెలుస్తోంది. 

అలాగే మధిర టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కాట రాంబాబు, కొత్తగూడెం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎడవల్లి కృష్ణ , రామగుండం టీఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్, అలాగే మేడ్చెల్ నుంచి టీఆర్ఎస్ రెబల్ నక్కా ప్రభాకర్, ఖైరతాబాద్ నుంచి టీఆర్ఎస్ రెబల్ మన్నె గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ రెబల్ రత్నాకర్ లతో ఇరుపార్టీల నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అటు అధికార పార్టీ టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కలిసొచ్చే ఏ అంశాన్ని వదలడం లేదు. సీఎం కుర్చీ నాదా నీదా సై అన్న చందంగా ఎవరికి వారు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నారు. ఓటర్ దేవుడు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు ఎలా ఉంటుందోనన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.  
 

Follow Us:
Download App:
  • android
  • ios