కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభ తర్వాత టీ కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వరంగల్ సభలో చేసిన రైతు డిక్లరేషన్‌ను పల్లెపల్లెకు తీసుకెళ్లేందుకు నేటి నుంచి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ సభ తర్వాత టీ కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. వరంగల్ సభలో చేసిన రైతు డిక్లరేషన్‌ను పల్లెపల్లెకు తీసుకెళ్లేందుకు నేటి నుంచి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఒక్కొక్క చారిత్రాత్మక గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించాలని నిర్దేశించారు. ఆ తర్వాత 30 రోజులపాటు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతు రచ్చబండ సభలు నిర్వహించనున్నారు. 

ఈ క్రమంలోనే నేడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మోగిలిపాలెం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపుచేశారు. ఈ క్రమంలో పలువురు టీఆర్ఎస్,కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మోగిలిపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.

ఇక, వరంగల్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోగా రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పలు పంటలకు ఎంఎస్‌పీ కల్పిస్తామని చెప్పారు. ‘వరంగల్ డిక్లరేషన్’ను గ్రామాలకు వెళ్లి వివరించాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సూచించారు. రైతులకు చేసిన 9 వాగ్దానాల కరపత్రం వారి చేతుల్లో ఉండేలా నాయకులు, కార్యకర్తలు చూసుకోవాలని చెప్పారు. ప్రతి యువకుడి చేతిలో కూడా కరపత్రం కనిపించాలన్నారు. 

ఈ క్రమంలోనే రచ్చబండ కార్యక్రమానికి టీ కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు 300 మంది సమన్వయకర్తలను పార్టీ నియమించింది. రానున్న 30 రోజుల్లో తెలంగాణలోని 12,000 గ్రామాలను కవర్ చేయనున్నారు. కోఆర్డినేటర్లు.. వరంగల్ డిక్లరేషన్‌ను ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లడానికి సమావేశాలను ప్లాన్ చేస్తారు. ఇక, సీనియర్ నేతలందరికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను అప్పగించి, వారి భాగస్వామ్యం తప్పనిసరి చేశారు.

నేడు.. ఆచార్య జయశంకర్ స్వ్రగామం అక్కంపేటలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదురుకూరు గ్రామంలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క రచ్చబండ నిర్వహిస్తారు. కొమురవెల్లి గ్రామంలో పొన్నాల లక్ష్మయ్య, హుజుర్ నగర్ లోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగిత్యాల మండలం పొలాస గ్రామంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక, పార్టీ ముఖ్య నేతలంతా వారి వారి నియోజకవర్గాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని.. రైతు డిక్లరేషన్ గురించి వివరించనున్నారు.