Asianet News TeluguAsianet News Telugu

తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. మల్లన్న ఏం అన్నాడంటే?.. వీడియో వైరల్

క్యూన్యూస్ మీడియా ట్విట్టర్‌లో నిర్వహించిన ఓ పోల్ తీవ్ర పరిణామాలకు బీజంగా మారింది. కేటీఆర్ తనయుడు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్‌ కారణంగా తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం పెల్లుబికింది. ట్విట్టర్ వేదికగానే కేటీఆర్ తీన్మార్ మల్లన్న, బీజేపీపై నిప్పులు చెరిగారు. తాజాగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు.

trs activists attacks teenmar mallanna over q news poll row
Author
Hyderabad, First Published Dec 25, 2021, 12:21 AM IST

హైదరాబాద్: బీజేపీ నేత తీన్మార్ మల్లన్న సారథ్యంలోని క్యూన్యూస్ మీడియా ట్విట్టర్‌లో నిర్వహించిన పోల్ తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నది. కేటీఆర్ తనయుడు హిమాన్షు బాడీ షేమింగ్ చేయడం టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఈ విషయమై ఇప్పటికే మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. తాజాగా, టీఆర్ఎస్ కార్యకర్తలు తీన్మార్ మల్లన్నపై దాడి చేశారు. క్యూన్యూస్ ఆఫీసులోకి వెళ్లి ఆయనపై చేయి చేసుకున్నారు. దుర్భాషలాడారు. ఏం అనుకుంటున్నార్రా? అంటూ తోసుకుంటూ మీదికి వెళ్లారు. కాగా, తన ట్విట్టర్‌ను హ్యాక్ చేశారని తీన్మార్ మల్లన్న సమాధానం చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కొందరు వ్యక్తులు తీన్మార్ మల్లన్నపై సీరియస్ అవుతూ దాడికి వెళ్తుండగా ఆఫీసులోని ఇంకొందరు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. అప్పటికే ఆ ప్రాంతంలో కొంత ఫర్నీచర్ ధ్వంసం అయినట్టు కనిపించింది. తన ట్విట్టర్ హ్యాక్ చేశారని తీన్మార్ మల్లన్న పదేపదే చెప్పారు. కాగా, ఇన్నాళ్లు తాము మీకు సపోర్ట్ చేశామని ఇంకొకరు వీడియో తీస్తున్నవారి వైపు నిలబడి అన్నారు. తీన్మార్ మల్లన్నపై దాడి చేసినవారు టీఆర్ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్నారు.

క్యూన్యూస్ సంస్థ ట్విట్టర్‌లో నిర్వహించిన పోల్ ఈ ఘర్షణకు మూలకేంద్రంగా ఉన్నది. అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా? అనే పోల్ ఈ వివాదానికి తెర తీసింది. హిమాన్షుపై బాడీ షేమింగ్ చేసేలా పోల్ పెట్టడం తండ్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆగ్రహం తెప్పించింది. ట్విట్టర్ వేదికగానే ఆయన తీన్మార్ మల్లన్నపై నిప్పులు చెరిగారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని కేటీఆర్ మండిపడ్డారు.

Also Read: హిమాన్షు శరీరాకృతిపై తీన్మార్ మల్లన్న పోల్.. కేటీఆర్ సీరియస్, నడ్డాకి ఫిర్యాదు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (jp nadda) ఈ పోల్‌పై ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్‌ షా (amit shah) కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నియంత్రించాలని కోరిన మంత్రి ... న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు.

దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios