Asianet News TeluguAsianet News Telugu

శాశ్వత ప్రత్యామ్నాయాలు ఇవీ: ఆర్టీసి కార్మికులకు అజయ్ ఫైనల్ వార్నింగ్

ఆర్టీసి సమ్మెపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తున్నారు. మూడు శాశ్వత ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ ప్రత్యామ్నాయాలేమిటో కూడా చెప్పారు.

Transport minister Puvvada Ajay states on TSRTC strike
Author
Hyderabad, First Published Oct 5, 2019, 2:54 PM IST

హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో చేరనివారు ఆర్టీసి ఉద్యోగులే కారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసి సమ్మెపై ఆయన శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల లోపు విధుల్లో చేరని ఆర్టీసి కార్మికులను భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించదని ఆయన స్పష్టం చేశారు. 

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 
ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది..

1.మూడు నుంచి నాలుగు వేల ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకుని నడపడం

2. ఆర్టీసీ బస్సులు నడపడానికి డ్రైవింగ్ లైసెన్సు కలిగిన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఉద్యోగావకాశం కల్పించడం. వారికి తక్షణం తగు శిక్షణ ఇచ్చి, బస్సులను యధావిధిగా నడపడం

3. ఆరు నుంచి ఏడు వేల ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు ఇవ్వడం

శనివారం సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితిని ప్రభుత్వం గమనించి ఆదివారం ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్షను ప్రభుత్వం నిర్వహిస్తుంది.  ఈ సమీక్షలోనే ఆర్టీసీకి సంబంధించి ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. 

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగానే మంత్రి పై ప్రకటన విడుదల చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios