హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మెగావాట్ విద్యుత్ కూడ ఉత్పత్తి చేయలేదని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు. విద్యుత్ సంస్థల పనితీరుపై అనుమానాలు ఉంటే సీబీఐ విచారణకు కూడ తాము సిద్దంగా ఉన్నామన్నారు. 

శుక్రవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.గురువారం నాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విద్యుత్ లో భారీ స్కామ్ చోటు చేసుకొందని విమర్శించారు. ఈ విమర్శలపై ఆయన స్పందించారు. 

విద్యుత్ ఒప్పందాల విషయంలో ఎంతో పారదర్శకంగా ఉన్నట్టుగా ఆయన చెప్పారు. విద్యుత్ సంస్థలు స్వతంత్ర సంస్థలని  ఆయన గుర్తు చేశారు. తమపై ఎవరి ఒత్తిడులు లేవన్నారు.ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తూ పారదర్శకంగా ఉన్నామన్నారు.

విద్యుత్ సంస్థలపై తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒక్క మెగావాటు విద్యుత్ కూడ ఉత్పత్తి జరగలేదని చెప్పడం సరైంది కాదన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 71 మె.వా సోలార్ పవర్ ఉండేదన్నారు. అయితే ఇవాళ సోలార్ పవర్ ఉత్పత్తి 3600 మె.వాట్లకు చేరుకొందని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 7775 మెగావాట్ల స్థాపిత శక్తి ప్రస్తుతం 16203 మెగావాట్లకు చేరుకొందన్నారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్దమేనని ఆయన సవాల్ విసిరారు.పరోక్షంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలకు కౌంటరిచ్చారు.