Asianet News TeluguAsianet News Telugu

అన్నాచెల్లెళ్లను ఒకేసారి కాటేసిన పాము.. ఆదిలాబాద్ లో విషాదం..

పాముకాటుతో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో విషాదం చోటు చేసుకుంది. 

Tragedy snake bite two children in Adilabad
Author
First Published Sep 12, 2022, 6:46 AM IST

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పూరిగుడిసెలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలోని ఇద్దరు పిల్లలను పాము కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. దారి సరిగా లేకపోవడంతో అష్టకష్టాలు పడుతూ చికిత్సకోసం ఆసుపత్రికి వెళ్లినా..  ఆ చిన్నారులను బతికించుకోలేపోయారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుతిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతిగూడకు  చెందిన కవితాబాయికి కుమురం భీం జిల్లా కెరమెరి మండలం అక్షయ పూర్ కు చెందిన ఆత్రం రాజుతో 18 ఏళ్ల కిందట వివాహమైంది. భర్తతో గొడవల కారణంగా రెండేళ్లుగా తన ఏడుగురు పిల్లలతో పుట్టింట్లోనే ఉంటూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 

కవితాబాయి తన పిల్లలతో శనివారం రాత్రి గుడిసెలో నిద్రిస్తుండగా.. రాత్రి రెండు గంటల  ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన పాము  భీంరావు (13), దీప (4)ను కాటు వేసింది. దీంతో పిల్లలు ఒక్కసారిగా కేకలు వేయడంతో కవిత బాయి మేల్కొంది. చూసేసరికి అప్పటికే పిల్లలను కాటేసిన నాగుపాము అక్కడినుంచి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని కవితాబాయి చుట్టుపక్కల వారికి తెలపడంతో..  స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వాహనం వచ్చి.. వారిని ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే అన్నాచెల్లెళ్లు ప్రాణాలు వదిలారు. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

మనిషి పగ... కాటేసిందని పామును కొరికి, కొరికి చంపి, మెడలో వేసుకుని.. ఊరంతా ఊరేగి..

రోడ్డు బాగుంటే ప్రాణాలు దక్కేవి..
మారుతిగూడ నుంచి ఇంద్రవెల్లి మార్గమధ్యంలోనే సమాక గ్రామం వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 2018లో రూ. 1.85  కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రతీ వర్షాకాలంలో మండల కేంద్రమైన ఇంద్రవెల్లికి వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి రహదారి బురదమయమై అంబులెన్సు సకాలంలో ఆరోగ్య కేంద్రానికి చేరుకోలేక పోయిందని.. రోడ్డు బాగుంటే చిన్నారుల ప్రాణాలు నిలిచేవని గ్రామస్తులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios