పెళ్లి భోజనం వికటించి.. 500మంది అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాలులో మంగళవారం వివాహం జరిగింది. ఆ వివాహ వింధుని కూడా అక్కడే ఏర్పాటు చేశారు.  కాగా.. పెళ్లి భోజనం తిన్న దాదాపు 500మంది అస్వస్థతకు గురయ్యారు.

భోజనంలో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు పేర్కొన్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తొలుత పదుల సంఖ్యలోనే అస్వస్థతకు గురైనప్పటికీ.. క్రమంగా వారి సంఖ్య వందల సంఖ్యకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. 

వైద్య సిబ్బంది బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.