సినిమాల్లో కామెడీ సీన్ లా అనిపిస్తున్నా ఇది నిజంగా జరిగింది. వరంగల్ లో ఏకంగా ఓ ట్రాఫిక్ ఎస్ఐ జీపునే ఎత్తుకెళ్లాడో ప్రబుద్ధుడు. అర్థరాత్రి వరకు వెతికి జీపును పట్టుకున్నారు. చివరికి తేలిందేంటంటే.. ఆ ఎత్తుకెళ్లిన వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగా లేదట..

వివరాల్లోకి వెడితే...వరంగల్ లో ఓ ట్రాఫిక్‌ ఎస్ఐ డ్యూటీలో భాగంగా కాజీపేట చౌరస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ సోదాలు నిర్వహిస్తున్నాడు. పోలీస్ జీప్ దగ్గర్లోనే ఆగి ఉంది. అయితే జీపు తాళాలు జీపుకే ఉన్నాయి. దీన్ని గమనించిన సమ్మయ్య అనే వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి ఎంచక్కా ఆ వాహనాన్ని తీసుకెళ్లాడు. 

విధి నిర్వహణలో ఉన్న ఆ ట్రాఫిక్‌ ఎస్‌ఐ జీపు పోయిందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు. వెంటనే తన సిబ్బందితో కలిసి జీపుకోసం వెతకటం ప్రారంభించాడు. అలా వారు రాత్రంతా జీపు కోసం వెతికారు. 

అయితే ఎస్‌ఐ మొబైల్‌ ఫోన్‌ జీపులోనే ఉండడంతో జీపు దొరికింది. ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా జీపెక్కడ ఉందో తేలిగ్గా గుర్తించారు. కాజీపేట్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో హసన్‌పర్తి మండలం కొమిటిపల్లి తండా సమీపంలో జీపును పట్టుకున్నారు. 

SI టోపీతో పాటు, ఇతర వస్తువులన్నీ అందులో భద్రంగానే ఉన్నాయి. జీపును ఎందుకు ఎత్తుకెళ్లాడని ఆరా తీస్తే పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. సమ్మయ్యకు మతిస్థిమితం సరిగా లేదని, అప్పుడప్పుడూ ఇలాంటి పనులు చేస్తుంటాడని తెలిసింది. జీపు దొరకడంతో ఆ సదరు ఎస్సై బతుకుజీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.