ఖైరతాబాద్ గణపతి 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 వరకు ఇక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు

హైదరాబాద్‌లో గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక జంట నగరాలకే ప్రత్యేకమైన ఖైరతాబాద్‌ వినాయకుడు ఈసారి కూడా భారీకాయంతో రూపుదిద్దుకున్నాడు. దీంతో గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణపతి 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 వరకు ఇక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. భక్తులు సొంత వాహనాల్లో రావొద్దని, మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాలకు పార్కింగ్‌ అనుమతిచ్చారు. వృద్ధులు, నడవలేని వారి వాహనాలకు మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు అనుమతిచ్చారు. ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేవలం భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.

అంతకుముందు ఖైరతాబాద్‌ మహాగణపతికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తొలి పూజ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.