రేపు, ఎల్లుండి లష్కర్ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతర నేపథ్యంలో రేపు, ఎల్లుండి పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు
భాగ్యనగరానికే తలమానికమైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు, ఎల్లుండి భక్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో 17, 18 తేదీల్లో సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉజ్జయిని మహంకాళీ ఆలయ సమీపంలోని రోడ్లను మూసివేస్తున్నామని.. ట్రాఫిక్ ను పలు మార్గాల్లో మళ్లిస్తామని ఆయన వెల్లడించారు.
రాణిగంజ్, ఓల్డ్ రామ్‌గోపాల్‌పేట పీఎస్, ప్యారడైజ్, ఎస్బీఐ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్, ప్యాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లేన్, బాటా, ఝాన్సీ మండీ క్రాస్ రోడ్, బైబిల్ హౌజ్, మినిస్టర్ రోడ్, రసూల్‌పూరా మార్గాల్లో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం బోనాలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో వుంటాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. టొబాకో బజార్, హిల్ స్ట్రీట్, సుభాష్ రోడ్, బాటా చౌరస్తా, రామ్‌గోపాల్ పేట, అడవయ్య చౌరస్తా, జనరల్ బజార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ , సెయింట్ మెరీస్ రోడ్డు, క్లాక్ టవర్ రోడ్లను మూసివేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు.
Also Read:ఆషాడం బోనాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: హైద్రాబాద్ లో బోనాలపై మంత్రి తలసాని సమీక్ష
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో బోనాల జాతరకు రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మంత్రి తలసాని పర్యవేక్షణలో బోనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి రెండుచోట్ల కొత్త ముఖద్వారాలను ఏర్పాట్లు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ. 58 లక్షల వ్యక్తిగత నిధులను ఖర్చు చేశారు.