ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపై మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ బయటపెట్టిన సర్వే వివరాలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఈ సర్వేపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుపమంటున్నారు. హరీష్ రావు కేసీఆర్ లాంటి నాయకులు ఈ సర్వేను బోగస్ సర్వేగా పేర్కొంటున్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన లగడపాటి కూడా స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చారు. 

తనకు ముందుగా సర్వే చేయమని  చెప్పింది...నియోజకవర్గాల వివరాలు ఇచ్చింది కూడా మంత్రి కేటీఆరేనని లగడపాటి సంచలన ప్రకటన చేశారు. అందుకు సంబంధించి తనకు, కేటీఆర్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ను బయటపెట్టారు. దీంతో సర్వేపై జరుగుతున్న వివాదంతో పాటు తాజాగా చాటింగ్ పై కూడా వివాదం రేగుతోంది. 

లగడపాటి బయటపెట్టిన ఛాటింగ్ పై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగున అడ్డుపడ్డ లగడపాటితో కేటీఆర్ ఇన్నాళ్లు రహస్య స్నేహాన్ని నడిపినట్లు ఈ ఛాటింగ్ ను చూస్తే అర్థమవుతోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోడానికి శత  విధాల ప్రయత్నించి చివరకు తన రాజకీయ జీవితాన్ని కూడా వదులుకున్న వ్యక్తితో కేటీఆర్ స్నేహం చేయడం దుర్మార్గమని రేవంత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.