టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్‌రెడ్డి కారుపై పెండింగ్ చలానాలు ఉన్నాయంటూ పోలీసులు ఆయనతో చలానాలు కట్టించారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ శనివారం కంటోన్మెంట్ ప్రాంతంలో పర్యటించారు.

తాడ్‌బండ్‌లోని ఆంజనేయస్వామి దేవాలయ్యాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యూబోయిన్‌పల్లికి వెళ్లే క్రమంలో తాడ్‌బండ్ చౌరస్తాలో సిగ్నల్ పడటంతో రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఆగింది.

అదే సమయంలో అక్కడ విధులు నిర్వరిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆయన కారు నెంబర్‌పై ఉన్న చలానాల జాబితాను పరిశీలించారు. సైదాబాద్, రాజేంద్రనగర్‌లో అతివేగం, నో పార్కింగ్ చేసినందుకు రేవంత్ కారుపై రూ.5 వేల చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అనంతరం ఆయన కారు వద్దకు వెళ్లి చలానాల గురించి రేవంత్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన వెంటనే వాటిని చెల్లించారు.