తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆరేపల్లి మోహన్ టీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మోహన్ గులాబీ కండువా కప్పుకున్నారు.

ఆయనతో పాటు పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరేపల్లి మోహన్ లాంటి సీనియర్ నేత టీఆర్ఎస్‌లోకి రావడం ద్వారా మానకొండూరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు.

టీఆర్ఎస్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పట్ల ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్న మోహన్ లాంటి నాయకులందరికీ పార్టీ సముచిత గౌరవం ఇస్తుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరపున మరింత మెజారిటీ సాధించేందుకు అందరూ కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

మోహన్ మాట్లాడుతూ ప్రజల కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రికి తోడ్పాటును అందించేందుకు పార్టీలో చేరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని రోజు రోజుకి కోల్పోతోందన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ కోసం ఒక కార్యకర్తగా పనిచేస్తానన్నారు.