ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై అఖిలపక్షం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఇంటర్ అక్రమాలపై న్యాయవిచారణ చేయాలని నేతలు గవర్నర్‌ను కోరారు. దీనిపై స్పందించిన నరసింహన్ విద్యార్ధుల సమస్యలపై కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు.

అనంతరం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్‌కు రెండు విషయాలపై నివేదిక ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలనపై కనీస అవగాహన లేదని.. అవినీతి మూలంగా లక్షల మంది విద్యార్ధులు బలయ్యారని ఉత్తమ్ మండిపడ్డారు.

ఇంటర్మీడియట్ ఫలితాలతో ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారన్నారు. విద్యార్ధులవి ఆత్మహత్యలా.. ప్రభుత్వ హత్యలా అని ఉత్తమ్ ప్రశ్నించారు. విద్యార్ధులందరీకి ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, అనుమతి లేకుండా సీఎల్పీ విలీనం కుదరదన్నారు. ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా చేసేందుకే.. సీఎల్పీ విలీనానికి తెరదీశారని ఉత్తమ్ ఆరోపించారు.

దేశంలో ఏ సీఎం ఇలా నిసిగ్గుగా వ్యవహరించలేదని కేసీఆర్‌పై మండిపడ్డారు. డబ్బులకు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే.. నాయకత్వానిదెలా తప్పవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని లేకుండా చేయాలనుకోవడం దారుణమన్నారు.

ఈ సందర్భంగా ఫిరాయింపు నిరోధానికి చొరవ చూపాలని గవర్నర్‌కు నేతలు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన గవర్నర్.. అన్ని విషయాలు గమనిస్తున్నా.. అభిప్రాయం బయటకు చెప్పలేనన్నారు.