జగన్‌లా కాదు.. స్టాలిన్ దగ్గర కేసీఆర్ పప్పులుడకలేదు: విజయశాంతి

First Published 15, May 2019, 7:43 AM IST
tpcc leader vijayashanthi satires on kcr over federal front
Highlights

ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ నేత విజయశాంతి సెటైర్లు వేశారు

ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ కాంగ్రెస్ నేత విజయశాంతి సెటైర్లు వేశారు.

గత మూడు నెలలుగా కేసీఆర్ ఆడిన డ్రామాకు తెరపడిందని.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తానని గొప్పలు చెప్పిన తెలంగాణ సీఎం ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోందని విజయశాంతి సెటైర్లు వేశారు. స్టాలిన్ ఇచ్చిన షాక్‌తో గులాబీ బాస్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లుందని ఆమె ఎద్దేవా చేశారు.

మాయ మాటలు చెప్పి, రాష్ట్ర విభజన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు చివరికి కల్లలుగా మిగిలిపోయాయని విజయశాంతి మండిపడ్డారు.

గత కొంతకాలంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో.. సారు, కారు, సర్కారు అంటూ నినాదాలు ఇచ్చిన వారి నోటి వెంట.. డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ వినిపిస్తోందని రాములమ్మ వ్యంగ్యస్త్రాలు సంధించారు.

వైసీపీ అధినేత జగన్‌ను బుట్టలో వేసుకున్న విధంగానే, స్టాలిన్‌ను కూడా తన వలలో వేసుకోవాలని కేసీఆర్ తన వద్ద వున్న గజకర్ణ, గోకర్ణ, విద్యలను ప్రదర్శించారు. కానీ తమిళనాట ఆయన పప్పులు ఉడకలేదని విజయశాంతి దుయ్యబట్టారు.

తన తండ్రి కరుణానిధి నాయకత్వంలో కేసీఆర్ వంటి ఎంతో మంది మాయగాళ్లను చూసిన అనుభవం స్టాలిన్‌కు ఉందని... అందుకే ఆ గిమ్మిక్కులను తిప్పికొట్టి స్టాలిన్ రాజనీతిని ప్రదర్శించారని రాములమ్మ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి.. కేసీఆర్ ట్రిక్స్‌కు స్టాలిన్ చెక్ పెట్టారని విజయశాంతి పోస్ట్ చెప్పారు. 

loader