కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు నెలల నుంచి ఎముకలు కొరికే చలిలో, రోడ్లపై రైతులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఎంఎస్‌పీపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ... 2013-14, 20- 21 లెక్కలను పోలుస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. 13-14లో దేశంలో రైతు ఆత్మహత్యలు ఎన్ని జరిగాయి..

20-21లో ఎన్ని రెట్లు రైతు ఆత్మహత్యలు పెరిగాయో ఆ లెక్కలు కూడా ఆర్ధిక మంత్రి ఇస్తే బాగుండేదని టీపీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. అలాగే అప్పట్లో ధాన్యం, గోధుమలు ఏ రేటుకు కొనేవాళ్లు, ఈ రోజు ఏ రేటుకి కొనేవాళ్లో చెబితే బాగుండేదని ఉత్తమ్ మండిపడ్డారు.

ప్రొక్యూర్‌మెంట్ ధర కూడా ఎన్నో రెట్లు పెరిగిన తర్వాత కూడా ఇలా వ్యవహరించడం రైతులను తప్పుదోవ పట్టించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. 2016లో వున్న రైతుల ఆదాయం.. 2022 నాటికి రెట్టింపు అవుతుందన్న మాట పచ్చి అబద్ధమని, ఈ దేశంలో ఏ రైతుకి కూడా ఆదాయం రెట్టింపు కాదు కదా..? కనీసం పెరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మెట్రో విస్తరణ కోసం నిధులు కేటాయించిన కేంద్రం.. హైదరాబాద్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ దివాళా దిశగా తీసుకెళ్తోందని.. ఎల్ఐసీ సహా పలు సంస్థల్లో 1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించడం దారుణమన్నారు.

Also Read:ఐదు రాష్ట్రాల ఎన్నికలు: బీజేపీది పెద్ద స్కెచ్చే.. కేటాయింపుల్లో సింహభాగం వాటికే

దీని వల్ల దాదాపు 12 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకొస్తున్నారని.. కానీ సామాన్యుడికి ఒరిగేందటని ఉత్తమ్ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీపై కేంద్రం ఎందుకు ముందుకు పోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ కర్ణాటకలో వేగంగా ముందుకు వెళ్తోందని .. కానీ హైదరాబాద్‌లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్ నుంచి విజయవాడకి సూర్యాపేట్, కోదాడల మీదుగా కొత్త రైల్వే లైన్‌తో బుల్లెట్ రైలు మంజూరు చేయాలని ఆయన సూచించారు. ఇవన్నీ కూడా ముంబై, అహ్మదాబాద్‌కే తీసుకెళ్తున్నారని.. హైదరాబాద్- విజయవాడ మార్గంలో బుల్లెట్ రైలుకి అనువుగా వుంటుందని ఉత్తమ్ కుమార్ చెప్పారు.