టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు అందజేసిన సాయంలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ ఆయన శుక్రవారం గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేశారు.

గాంధీభవన్‌ నుంచి గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వరదసాయంలో జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. వరద సహాయక చర్యల్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రూ.కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని.. బాధిత కుటుంబాలకు సహాయన్ని నగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

బాధితులకు ఇచ్చే వరద సాయం రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచాలని పీసీసీ చీఫ్ కోరారు. నిజమైన బాధితులకు వరద సాయం అందలేదని ఆయన ఆరోపించారు.

పార్టీ శ్రేణులను ఆర్థికంగా బలోపేతం చేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నగదు పంపిణీ చేసిందని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

వరదల్లో పలువురు మృతి చెందడంతో పాటు వేలమంది నిరాశ్రయులైనా సీఎం కేసీఆర్ కనీసం పరామర్శించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు.