హైదరాబాద్‌లో గత రెండు నెలల నుంచి వరదనీటితో ఇబ్బంది పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి .

ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. రెండు నెలల నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలుకాలనీల్లో వరదనీటిలో వెయ్యి ఇళ్లు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు నెలలుగా బురద నీటిలో విలవిల్లాడుతున్న ఉస్మాన్ నగర్, సయిఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసులు పడుతున్న బాధలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రాలేదని ఆయన ఆరోపించారు.

నగరానికి కూత వేటు దూరంలో ఉన్న ఓ మంత్రి నియోజకవర్గంలో ఇప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని ఉత్తమ్‌ లేఖలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, కలెక్టర్‌లను వివరణ కోరగా.. ప్రభుత్వానికి నివేదికలు పంపామని, నిధులు మంజూరవ్వగానే పనులు చేస్తామని చెబుతున్నట్లు ఉత్తమ్‌ వివరించారు.

ఇప్పటికైనా ఆయా కాలనీల్లో యుద్ధప్రాతిపదికన వరద నీటిని బయటకు పంపేందుకు పనులు చేపట్టాలని పీసీసీ చీఫ్ డిమాండ్‌ చేశారు. వారికి జరిగిన ప్రతి చిన్న నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఇంటికి లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం అందించాలని ఉత్తమ్ కోరారు. అలాగే వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారంగా చెల్లించాలని సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్‌ కోరారు.