తెలంగాణలో స్ధానిక సంస్ధల కోటాలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడాకు లేఖ రాశారు.

ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఓటర్ల జాబితా అందుబాటులో లేదని.. అయినా రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక  సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని.. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ నెల 27వ తేదీ నాటికి అందుబాటులో వస్తారని ఉత్తమ్ పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని తన లేఖను అత్యవసరంగా పరిగణించి ఇప్పుడిచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.