టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారన్నారు.

తమ పార్టీ నాయకులతో కలిసి శాసనసభ ఎదుట రోడ్డుపై ఆయన నిరసనకు దిగారు. తెలంగాణ ప్రజల తీర్పును కేసీఆర్ అవమానపరిచారని.. ఆంధ్రా కాంట్రాక్టర్ల సొమ్ముతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. స్పీకర్ తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని.. అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్రగా వెళతామని ఉత్తమ్ తెలిపారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. స్పీకర్ అందుబాటులో లేరని ఆయన కార్యాలయ సిబ్బంది చెప్పారు. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఎలా కలిశారంటూ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహస్యంగా ఎమ్మెల్యేను కలవాల్సిన అవసరం స్పీకర్‌కు ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ నిరసన తెలిపిన వారిలో ఉన్నారు.