సుధీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టిపిసిసి నిర్ణయించింది. శాసన మండలిలో ఖాళీ అయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంకోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో నిలవనున్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అధికారికంగా మాత్రం బుధవారం ప్రకటించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

త్వరలో శాసన మండలిలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్ధానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఇప్పటికే ఎమ్మెల్యే కోటా స్థానాల ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడగా...త్వరలోనే టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నిక కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ముందుగానే కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసే అభ్యర్ధిగా జీవన్ రెడ్డి ఎంపికచేసింది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఎంపీ గా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.... వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జీవన్ రెడ్డిని పోటీలో నిలపాలని డిమాండ్‌ చేశాయి. దీంతో కాంగ్రెస్‌ కు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించక తప్పలేదు. 

ఇక ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానానికి కాంగ్రెస్ బరిలో వుంటుందని ఉత్తమ్ ప్రకటించారు. త్వరలో ఈ తమ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని ఉత్తమ్ వెల్లడించారు.