తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధారణంగా ఎప్పుడు కూడా నోరు జారడు. చెత్త భాష, బూతు భాష ఆయన నోటినుంచి ఎప్పుడూ వచ్చిన దాఖలాలు లేవు. ఆయన ఎప్పుడైనా పద్ధతి ప్రకారమే మాట్లాడతారు తప్ప గలీజ్ మాటలు అసలే మాట్లాడడు అన్న పేరుంది. ఎందుకంటే ఆయన సైనికుడు. సైన్యంలో పనిచేసిండు కాబట్టే ఆయన భాష హుందాగా ఉంటది అని ఆయన అనుచరులు చెప్పే మాట. ఆయనే కాదు కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కూడా ఏనాడూ మాట తూలలేదు. గలీజ్ భాష మాట్లాడలేదు. చిల్లర మాటలు ఎవరినీ అనలేదు. జానారెడ్డిని ఎవరు ఎంత ఇరకాటంలో పడేసినా ఏనాడూ ఆయన హుందాభాషలోనే మాట్లాడిండు తప్ప ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు.

అదే కాంగ్రెస్ పార్టీలో గలీజ్ మాటలు మాట్లాడే నాయకులు చాలా మందే ఉన్నారు. కొందరు మహిళా నాయకురాళ్లు కూడా గలీజ్ భాషలో తిట్ల దండకం అందుకునేవారు కూడా ఉన్నారు. ఇక టిఆర్ఎస్ లో అయితే అటువంటి లీడర్ల సంఖ్య చెప్పలేనంతగా ఉంటది. టిడిపిలో కూడా జాబితా బాగానే ఉంటది. బిజెపి, లెఫ్ట్ పార్టీల్లో గలీజు భాష మాట్లాడే వారు ఉండరు. తిట్ల భాష, బూతుల భాష వినియోగించడంలో తెలంగాణలో టాప్ లీడర్ గా ఎవరున్నారో, టాప్ పార్టీగా ఏ రాజకీయ పార్టీ నిలిచిందో తెలంగాణ వారికే కాక సీమాంధ్ర వారికి కూడా తెలుసు.

హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు దాసోజు శ్రవణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కరుకు భాషలో విమర్శల వర్షం కురిపించారు. సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతుండగా స్థానిక మహిళలు తమకు బ్యాంకుల్లో స్టేట్ మెంట్ అడిగితే ఇవ్వడంలేదని ఉత్తమ్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు బ్యాంకు చుట్టు తిరిగినా ఇవ్వడంలేదని ఆరోపించారు. దీంతో ఎందుకివ్వడంలేదని ఉత్తమ్ వారిని అడిగారు. ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వడంలేదని మహిళలు మళ్లీ ఉత్తమ్ కు చెప్పారు. దీంతో ఉత్తమ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మీ స్టేట్ మెంట్ మీకు ఇవ్వమంటే ఎందుకివ్వరు. ఎవడాడు? స్టేట్ మెంట్ ఇయ్యకపోతే గల్లా పట్టి దబాయించి అడిగి తీసుకోండి... ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా. ఎవడయ్యా..? స్టేట్ మెంట్ ఇయ్యనోడిని పట్టుకుని తన్నాలి.. అంటూ ఘాటుగా స్పందించారు ఉత్తమ్.

ఇదే సమావేశంలో ఈ సబ్జెక్ట్ తర్వాత మరో అంశంలోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసిఆర్ పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో ఇండ్లు మంజూరు చేస్తే వాటిని కేసిఆర్ సర్కారు ఆపేసిందని ఆరోపించారు. ‘‘సిగ్గు శరం లేని సర్కారు పెద్ద ఇండ్లు కట్టకుండా ఆపేసిండు. ఈ తెలంగాణ ఎవడి జాగీరు అనుకుంటున్నడు? ఎవడి అబ్బ సొమ్ము అని హుజూర్ నగర్ పట్టణంలో ఇండ్లు ఆపించిండు? పనులు ఆపించడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషికి సిగ్గు లేదా అని అడుగుతున్నా’’ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఉత్తమ్.

మొత్తానికి ఉత్తమ్ కొత్త భాష రాజకీయ వర్గాల్లో కొత్త చర్చను లేవనెత్తే చాన్స్ ఉందంటున్నారు.