మల్లన్న సాగర్ కోసం 60 వేల ఎకరాల భూమిని గుంజుకుని 14 గ్రామాలను నట్టేట ముంచి పేదల బతుకులను నడి బజార్లో వదిలిపెట్టాడంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్‌లో జరిగిన దళిత గిరిజన దండోరా సభలో ఆయన ప్రసంగించారు. కొండపోచమ్మ దగ్గర కేసీఆర్ బంధువు కావేరి సీడ్స్ భాస్కరరావు భూమిని కాపాడటానికి ఆ గ్రామాల్లో పేదల భూములు గుంజుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఇంద్రవెల్లిలో తొలి దళిత గిరిజన దండోరా సభ పెట్టినప్పుడు గజ్వేల్‌కు వస్తే చూసుకుంటామని.. కొందరు టీఆర్ఎస్ నేతలు అన్నారని .. తాను అప్పుడే గజ్వేల్‌ గడ్డమీద కదం తొక్కుతామని చెప్పానన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గజ్వేల్‌లో జరిగిన దళిత గిరిజన దండోరా సభలో ఆయన ప్రసంగిస్తూ.. లక్ష మంది సైనికులతో వస్తానని చెప్పానని.. కానీ ఇసుక వేస్తే రాలనంత మంది తరలివచ్చారని చెప్పారు. రెండు లక్షలకు ఒక్క తలకాయ తగ్గినా మళ్లీ ఆరు నెలల్లో గజ్వేల్ గడ్డ మీద కదం తొక్కుదామని.. ఆ రోజు ఐదు లక్షల మందితో వస్తానని రేవంత్ స్పష్టం చేశారు.

రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. మల్లన్న సాగర్, కొండ పోచమ్మలను తీసుకొచ్చారని ఆయన తెలిపారు. అయితే మల్లన్న సాగర్ కోసం 60 వేల ఎకరాల భూమిని గుంజుకుని 14 గ్రామాలను నట్టేట ముంచి పేదల బతుకులను నడి బజార్లో వదిలిపెట్టాడంటూ రేవంత్ మండిపడ్డారు. కొండపోచమ్మ దగ్గర కేసీఆర్ బంధువు కావేరి సీడ్స్ భాస్కరరావు భూమిని కాపాడటానికి ఆ గ్రామాల్లో పేదల భూములు గుంజుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడకు కూతవేటు దూరంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిన కేసీఆర్ .. 14 గ్రామాల వారిని దిక్కులేని అనాథలను చేశారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

మెదక్ జిల్లాకు ప్రత్యేకత వుందని.. అక్రమ కేసులతో మగ్గిపోతున్న ఇందిరా గాంధీని మెదక్ వాసులు ఆదరించి ప్రధానిని చేశారని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టాలలో వున్నప్పుడు మెదక్ జిల్లా .. ఆనాడు ఇందిరమ్మకు అండగా నిలబడ్డారని.. అలాగే సోనియా గాంధీ నాలుగు కోట్ల ప్రజల విముక్తి కోసం ఏపీలో పార్టీ చచ్చిపోయినా లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ తెలిపారు. ఆనాడు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానని ఇంటికెళ్లి .. కాళ్లకు దండం పెట్టి తెల్లాసరికి కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని మండిపడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.