మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాడిసన్ పబ్ గుట్టంతా అతని వద్దే వుందని ఆయన అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన సీఐ నాగేశ్వరరావు (ci nageswararao) వ్యవహారంలో తవ్వేకొద్ది ఆయన లీలలు వెలుగులోకి వస్తున్నాయి . ఈ నేపథ్యంలో టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐ నాగేశ్వరరావును ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ (kcr) కుటుంబానికి సీఐ ఎంతో సన్నిహితుడని.. రాడిసన్ పబ్ వివరాలన్నీ ఆయన వద్దే వున్నాయని రేవంత్ ఆరోపించారు. అందులోనే యువరాజు చిట్టా కూడా వుందన్నారు రేవంత్. పోలీసులు అత్యాచారం చేస్తే పట్టించుకోరా అని నిలదీశారు. కేసు తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని.. అమ్మాయిపై పోలీసులే రివర్స్ కేసు పెట్టాలని యోచిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. భర్తపైనా బ్లాక్ మెయిల్ కేసు పెట్టాలని చూస్తున్నారని రేవంత్ అన్నారు.
మరోవైపు సీఐ నాగేశ్వరరావు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిర్యాదు అందిన రోజు ఆయన నైట్ డ్యూటీలోనే వున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. విచారణకు సహకరిస్తానని చెప్పడంతో వనస్థలిపురం ఆయనను నమ్మి విడిచిపెట్టారు. ఈ మేరకు లెటర్ రాయించుకుని నాగేశ్వరరావను బయటకు పంపారు. ఆధారాలు బయటకు వస్తాయనే భయంతో నాగేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఈ కేసులో అన్ని ఆధారాలను పోలీసులు పక్కగా సేకరిస్తున్నారు.
ALso REad:వివాహితపై రేప్: సస్పెండైన సీఐ నాగేశ్వర్‌రావుపై పలు కేసులు
మరోవైపు మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. సీఐ నాగేశ్వరరావు ఎంతో మంది భవిష్యత్తును నాశనం చేసే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓ ఆస్తి కేసులో అన్యాయంగా ఇరికించాడని అన్నారు. తనకు సంబంధం లేదని చెప్పినా.. కేసు నుంచి పేరు తొలగించడంలో జాప్యం చేశాడని తెలిపారు. ఫిర్యాదుచేసిన వారు తనకు సంబంధం లేదని చెప్పిన వినిపించుకోలేదని చెప్పారు.
ఉన్నతాధికారులు, నేతలకు రూ.కోట్లు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న తనకు అంతే డబ్బు కావాలని నాగేశ్వరరావు ప్రచారం చేసుకున్నాడని టీజీ వెంకటేశ్ ఆరోపించారు. ఈ విధంగా చేయడం ద్వారా పై అధికారులకు, నాయకులకు చెడ్డపేరు తీసుకొచ్చేలా చేశాడని విమర్శించారు. నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని లేకపోతే పోలీసుశాఖకు చెడ్డపేరు వస్తుందన్నారు. ఈ మేరకు టీజీ వెంకటేశ్ ఓ వీడియో విడుదల చేశారు.
