త్వరలో కాంగ్రెస్‌లోకి కీలక నేతలు : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వచ్చే తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర పార్టీలకు చెందిన కొందరు కీలక నేతలు త్వరలోనే పార్టీలో చేరుతారని ఆయన తెలిపారు . కాంగ్రెస్ గెలుపు ప్రజలకు తక్షణ అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు.
వచ్చే తెలంగాణ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు వుంటాయని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలకు చెందిన కొందరు కీలక నేతలు త్వరలోనే పార్టీలో చేరుతారని ఆయన తెలిపారు.
సోనియా గాంధీ సభకు గ్రౌండ్ ఇవ్వకపోయినా విజయభేరి సభ విజయవంతమైందన్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్ధుల్లో 86 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వారేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సామాజిక న్యాయం, స్వేచ్ఛ కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ గెలుపు ప్రజలకు తక్షణ అవసరమని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇకపోతే.. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వరుసపెట్టి భేటీ అవుతోంది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా చర్చించింది స్క్రీనింగ్ కమిటీ. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తయినట్లుగా సమాచారం. 60 శాతానికిపైగా ఏకాభిప్రాయంతో అభ్యర్ధులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి సమావేశం కానుంది స్క్రీనింగ్ కమిటీ. పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీకి , కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేసింది స్క్రీనింగ్ కమిటీ.
గురువారం సాయంత్రం మురళీధరన్ అధ్యక్షతన సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అర్ధరాత్రి వరకు చర్చించిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వివాదరహిత నేతల జాబితాను కేంద్ర స్క్రీనింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించారు. పోటీ తీవ్రంగా వున్న చోట్ల అసంతృప్తులు, రెబల్స్ తయారవకుండా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది.