Asianet News TeluguAsianet News Telugu

ప్రతీది రాజకీయమేనా.. బండి సంజయ్ పాత్రను తీసుకోవద్దు : తమిళిసై పై రేవంత్ వ్యాఖ్యలు

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్- తెలంగాణ ప్రభుత్వం మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌పై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. . బండి సంజయ్ పాత్ర పోషించాలనుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 

tpcc chief revanth reddy reacts on telangana govt vs governor tamilisai soundararajan issue
Author
First Published Nov 9, 2022, 6:44 PM IST

ప్రతీది గవర్నర్ రాజకీయం చేయడం సరికాదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అలాగే గవర్నర్ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని ఆయన వివరణ ఇచ్చారు. గవర్నర్ కూడా ప్రతీది రాజకీయ కోణంలో చూడొద్దని రేవంత్ సూచించారు. బీజేపీ బాధ్యతను కూడా గవర్నర్ చేయాలనుకోవడం .. బండి సంజయ్ పాత్ర పోషించాలనుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షోకాజ్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఏఐసీసీ సభ్యుడని.. ఇది పీసీసీ పరిధి కాదని, ఏఐసీసీ తీసుకుంటుందన్నారు. 

అంతకుముందు .. ఫామ్‌హౌస్‌ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగాలని చూశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో జాప్యంపై ఆమె వివరణ ఇచ్చారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుషార్ గతంలో ఏడీసీగా పనిచేశారని తెలిపారు. తుషార్ పేరు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకొచ్చారని తమిళిసై ఆరోపించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయని గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్ కేసులో తొలుత తుషార్.. తర్వాత రాజ్‌భవన్ పేరును ప్రస్తావించారని తమిళిసై అన్నారు. ఏడీసీగా పనిచేసినంత మాత్రానికే రాజ్‌భవన్‌ పేరును కేసులోకి లాగుతారా అని ఆమె ప్రశ్నించారు. 

ALso REad:నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో... ఫాంహౌస్‌ కేసులో రాజ్‌భవన్‌ను లాగాలనే : తమిళిసై సంచలన వ్యాఖ్యలు

రాజ్‌భవన్ ముందు ఆందోళన చేస్తామని జేఏసీ హెచ్చరిస్తోందని.. ఎవరొచ్చినా మాట్లాడేందుకు సిద్దంగా వున్నానని తమిళిసై స్పష్టం చేశారు. కానీ ఆందోళనలు చేసేలా వారిని ఎవరు రెచ్చగోడుతున్నారని ఆమె ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో పరిస్ధితులను కళ్లారా చూశానని తమిళిసై తెలిపారు.  పిల్లలకు మెస్‌లో తినడానికి తిండి లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో పరిస్ధితుల్ని ప్రభుత్వం మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రగతి భవన్‌లాగా రాజ్‌భవన్ గేట్స్ మూసివేయలేదని తమిళిసై అన్నారు. తెలంగాణకు న్యాయం జరగాలని క్లారిఫికేషన్ అడిగానని ఆమె తెలిపారు. మంత్రికి అవగాహన లేకుండా మాట్లాడారని గవర్నర్ పేర్కొన్నారు. 

బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని అన్నారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా అర్ధం చేసుకున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు. ఒక్కొక్క బిల్లుని కూలంకషంగా పరిశీలిస్తున్నానని.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును తాను ఆపుతున్నట్లు ప్రచారం చేశారని.. ఒక బోర్డు ఉండగా కొత్త బోర్డు ఎందుకని ఆలోచించానని తమిళిసై తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని తానే డిమాండ్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. దానికి తానేదో బిల్లుల్ని ఆపానని ప్రచారం చేశారని తమిళిసై ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీ వీసీలతో మాట్లాడానని.. సమగ్ర నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి పంపించానని గవర్నర్ వెల్లడించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎందుకు.. అన్నదే తన ప్రశ్న అని ఆమె స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios