లిక్కర్ కేసును పక్కదారి పట్టించేందుకే ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఐదేళ్లు ఎంపీగా వున్న కవిత రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించారు. లిక్కర్ కేసును పక్కదారి పట్టించేందుకే ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టారని ఆయన ఆరోపించారు. అలాగే అదానీ స్కాంపై చర్చ జరగకుండానే ఈ ప్లాన్ చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ఎంపీగా వున్న కవిత రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు వస్తే కొడుకైనా, కూతురైనా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కేసీఆర్ అన్నారని రేవంత్ గుర్తుచేశారు. అవినీతి ఆరోపణల నెపంతో డిప్యూటీ సీఎంగా వున్న రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని రేవంత్ అన్నారు. మరి కవితపై అలాంటి చర్యలు లేవా అని పీసీసీ చీఫ్ ప్రశ్నించారు. 

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంటే.. కమలనాథులు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. అయితే కవిత నోటీసుల వ్యవహారం కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. ఈ వ్యవహారంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రశ్నించగా.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించాల్సింది తాను కాదని రేవంత్ రెడ్డని అన్నారు. ఉదయం కవితకు నోటిసులిస్తే.. ఇంత వరకు ఆయన ఎందుకు స్పందించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కవిత వ్యవహారంపై ఏమైనా వుంటే పీసీసీ అధ్యక్షుడినే అడగాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.