Asianet News TeluguAsianet News Telugu

రజత్ కుమార్ కుమార్తె వివాహంపై ఆరోపణలు.. విచారించకుంటే మీపై అనుమానాలు తప్పవు: కేసీఆర్‌కు రేవంత్ లేఖ

తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కుమార్తె (rajat kumar) వివాహం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఈ నేపథ్యంలో రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (revanth reddy) డిమాండ్‌ చేశారు

tpcc chief revanth reddy letter to cm kcr over telangana bureaucrat rajat kumar daughter grand wedding
Author
Hyderabad, First Published Jan 28, 2022, 7:43 PM IST

తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కుమార్తె (rajat kumar) వివాహం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఈ నేపథ్యంలో రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (revanth reddy) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన శుక్రవారం లేఖ రాశారు. రజత్ కుమార్, షెల్ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇతర అధికారులతోపాటు, ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. తన డిమాండ్లపై ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ (kcr) స్పందించకుంటే ఆయన తీరును రాష్ట్ర ప్రజలు అనుమానించే పరిస్థితి వస్తుందని రేవంత్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజమని నమ్మాల్సి వస్తుందన్నారు. 

గతేడాది డిసెంబర్‌లో రజత్‌కుమార్‌ కుమార్తె వివాహానికి అయ్యే ఖర్చును కొన్ని షెల్‌ కంపెనీలు భరించినట్లు, ఈ కంపెనీలకు కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతున్న ‘మేఘా’తో సంబంధాలున్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. రజత్ కుమార్ కూతురు పెళ్లికి సంబంధించిన బిల్లులను బిగ్ వేవ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ రహస్య కంపెనీ చెల్లించినట్టుగా ది న్యూస్ మినిట్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆ కంపెనీ చిరునామా కోసం వెతకగా.. పాతబస్తీలోని బహదూర్‌పురా ప్రాంతంలో ఉంది. అక్కడ నివాసం ఉంటున్న మహిళ చిరునామాతో.. పెళ్లికి బిల్లులు చెల్లించిన కంపెనీ రిజిస్టర్ చేయించబడి ఉంది. అయితే ఆ కంపెనీ గురించి ఆమెకు ఎటువంటి అవగాహన లేదు. ఈ క్రమంలోనే ఆ బిల్లులు ఎవరూ చెల్లించారని ఆరా తీయగా ప్రభుత్వ కాంట్రాక్టర్ Megha Engineering and Infrastructure Limited కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌లు,.. ఈ పెళ్లి ప్రణాళికలల్లో పాల్గొన్నట్టుగా, అన్ని దగ్గరుండి చూసుకున్నట్టుగా పత్రాలను కనుగొన్నట్టుగా ఆ కథనం పేర్కొంది. 

మేఘా కంపెనీ విషయానికి వస్తే.. తెలంగాణలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఈ సంస్థ అనేక పనులు చేపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన  ఈ ప్రాజెక్టు దేశంలో అత్యంత ఖరీదైన నీటిపారుదల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. దీని వ్యయం 1.15 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పలువరు అభివర్ణించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించే ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగానికి రజత్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు, ప్రభుత్వం తరఫున ఆ పనులను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారికి మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 

రజత్ కుమార్ కూతురు వివాహ వేడుకల కోసం కాంట్రాక్ట్‌లు, బుకింగ్‌లు, చెల్లింపులను మేఘా కంపెనీఎగ్జిక్యూటివ్‌లు తాజ్ గ్రూప్‌తో సమన్వయం చేశారని తమ వద్ద ఉన్న పత్రాలు వెల్లడిస్తున్నాయని ది న్యూస్ మినిట్ పేర్కొంది. వీటిని తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ ఫలక్‌నుమా హోటళ్లలో వివిధ వివాహ కార్యక్రమాలకు, అతిథులు బస చేయడానికి ఉపయోగించబడ్డాయి. ఈ పెళ్లికి సంబంధించిన వేర్వేరు కార్యక్రమాల ప్రణాళికలను హోటళ్ల సిబ్బందితో చర్చించేటప్పుడు మెగా సంస్థ ఎగ్జిక్యూటివ్ లు తమ కంపెనీ మెయిల్ ఐడీల‌తోపాటు కొన్ని డమ్మీ ఐడీల‌ను ఉపయోగించి ఈవెంట్స్ కోసం సమన్వయం చేశారు. తొలుత డమ్మీ మెయిల్ ఐడీలు ఉపయోగించి సంప్రదింపులు జరిపిన అందులో కొందరు తమ అసలు పేర్లనే పేర్కొన్నారు. తొలుత ఫేక్ ఐడీలు వాడిన.. ఆ తర్వాత మాత్రం తమ అధికారిక మెయిల్ ఐడీలను వినియోగించారు. 

ఇందుకు సంబంధించిన వివరాలను ది న్యూస్ మినిట్ తన కథనంలో వివరంగా రాసుకొచ్చింది. గతేడాది జూలై 31న హోటల్‌లో బాంక్వెట్ హాల్స్, రూమ్స్ బుక్ చేసుకోవడానికి bookingshyderabad అనే జీమెయిల్ ఖాతా వినియోగించబడింది. ఆ మెయిల్‌లో మురళి అని సంతకం చేసి ఉంది. ఆ తర్వాత Murali Kతోపాటుగా మేఘా సంస్థ మరో ఎగ్జిక్యూటివ్ Prameelan T.. బుకింగ్, ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులను సమన్వయం చేశారు. 

మురళి.. డిసెంబర్ 17 మధ్యాహ్న భోజనం కోసం అల్ ఫ్రెస్కో లాన్, హై టీ కోసం లగ్జరీ స్వీట్, రాత్రి భోజనం కోసం చాంబర్స్ లాన్.. అలాగే డిసెంబర్ 18న బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ల కోసం గార్డెన్ రూమ్, లంచ్ కోసం అల్ ఫ్రెస్కో లాన్.. అదే విధంగా తాజ్ కృష్ణా లోని ఇతర స్థలాలను డిసెంబర్ 19, 20, 21 లలో భోజనాల కోసం బుక్ చేశారు. ఈ బుకింగ్ లన్నిటినీ డిసెంబర్ 13న ఖరారు చేశారు. హోటళ్లతో మేఘా కుదుర్చుకున్న మొదటి ఒప్పందం ప్రకారం మొత్తం ఖర్చు దాదాపు యాబై లక్షల రూపాయలు. ది న్యూస్ మినిట్ సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఇన్వాయిస్‌లు.. ఇంటరాక్టివ్ డాటా సిస్టమ్స్, రెండవది బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో ఉన్నాయి.

ఇందులో ఇంటరాక్టివ్ డాటా సిస్టమ్స్ డైరెక్టర్లు మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థల బోర్డులలో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఆ ఇన్వాయిస్‌ల చెల్లింపుల సమయం వచ్చేసరికి మేఘాతో సంబంధం ఉన్న కంపెనీ వెనక్కి తగ్గింది. బాకీగా మిగిలిన 23 లక్షల రూపాయలను బిగ్ వేవ్ చెల్లించాల్సిందిగా చూపారు. ఈ బుకింగ్ లకు సంబంధించిన మొదటి సంప్రదింపులు స్వయంగా రజత్ కుమార్ చేశారనే సమాచారం తమకు అందిందని ది న్యూస్ మినిట్ పేర్కొంది. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లనూ మేఘా ఇంజనీరింగ్ కు చెందిన ఇద్దరు ఉన్నత ఉద్యోగులతో పాటు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా ఉన్న ప్రభాకర్ రావు చూసుకున్నారని తమకు సమాచారం ఇచ్చినవారు నిర్దారించారని తెలిపింది. 

ఇక, రజత్ కుమార్.. డిసెంబర్ 20న తన కూతురు, అల్లుడితో పాటు మొత్తం 70 మంది అతిథులకు అత్యంత విలాసవంతమైన తాజ్ ఫలక్‌నుమాలో విందు ఇచ్చారు. ఆ విందు కోసం ఒక్కొక్క అతిథికీ రు. 16,520 చొప్పున చెల్లించారు. అయితే తాజ్ ఫలక్‌నుమాలో విందుకు సంబంధించిన ఫొటోలను రజత్‌ కుమార్ కూతురు, ఇతర కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విందుకు అయిన మొత్తాన్ని బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భరించింది.

ఆ కంపెనీల గురించి..
రజత్ కుమార్ కూతురి పెళ్లికి సంబంధించి బిల్లు చెల్లించిన రెండు కంపెనీలలో ఒక్కటైన.. ఇంటరాక్టివ్ డాటా సిస్టమ్ అనే కంపెనీని 2010 జూన్ లో స్థాపించారని తెలిసిందని ది న్యూస్ మినిట్ పేర్కొంది. ఆ కంపెనీకి సుమలత పురిటిపాటి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు, వెంకట సుబ్బా రెడ్డి పురిటిపాటి డైరెక్టర్ గా ఉన్నారు. కృష్ణవేణి చింతపల్లి అదనపు డైరెక్టర్ గా ఉన్నారు. మేఘా గ్రూపుకు చెందిన ఎన్నో ఇతర కంపెనీలలో కూడా వీరు డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక, బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.. ఈ వివాహానికి కొద్ది నెలల ముందు 2021 జూన్ లో స్థాపించారు. ఈ కంపెనీ డైరెక్టర్లుగా సంధ్య అగర్వాల్, అనూష అనే వారున్నారు. ఈ కంపెనీ “బిల్డింగ్ ఇన్స్టలేషన్” పనులు చేస్తుందని నమోదై ఉంది. 

బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌ రిజస్టర్డ్ చిరునామాలో నివాసం ఉంటున్న బహదూర్ పురాలోని మహిళ.. ఆ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన సంధ్య అగర్వాల్ తల్లి అని తెలిసింది. అయితే సంధ్య అగర్వాల్‌ను తాము ఫోన్‌లో సంప్రదించగా.. ఆమె ఇబ్బంది పడినట్టుగా ది న్యూస్ మినిట్ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వా సంధ్య భర్త శ్రీకాంత్ ఫోన్ చేసి.. తమకు బిగ్ వేవ్‌కు ఎలాంటి సంబంధం లేదని, తాను ఇంటరాక్టివ్ డాటా సిస్టమ్స్ ఉద్యోగినని చెప్పారు. 

తొలుత చెల్లింపులకు మొత్తం రూ. 50 లక్షల ఖర్చు అవుతుందని వారు భావించారు. ఇందుకోసం BigWave Infra Private Limited నుంచి చెక్ రూపంలో రూ. 23 లక్షల చెల్లింపు జరిగిందని.. ఇంకా రూ. 5 లక్షల బాకీ ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని ది న్యూస్ మినిట్ పేర్కొంది. అయితే తాజ్ గ్రూప్ మాత్రం వివాహానికి సంబంధించిన ఏ వివరమూ ఇవ్వడానికి సిద్ధంగా లేదని తెలిపింది. మరోవైపు బిగ్ వేవ్ కూడా తాము చెల్లింపులు చేశామని నిర్దారించలేదు. అయితే ఈ మొత్తం చెల్లింపులు ఎంత జరిగాయి..? ఎవరెవరు ఎంత చెల్లించారు అనే సూక్ష్మమైన వివరాలు మాత్రం ఇంకా తెలియవలసే ఉందని పేర్కొండది.

వీటిపై ది న్యూస్ మినిట్ రజత్ కుమార్, మేఘా ఇంజనీరింగ్‌లను సంప్రదించగా.. వారు ఖండించినట్టుగా పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజ్ గ్రూప్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ శాంతలా జైన్‌ను స్పందిస్తూ.. “దీని మీద మేం ఏమీ వ్యాఖ్యానించ దలచుకోలేదు. మా క్లైంట్ల సమాచారాన్ని మేం బైట పెట్టబోం” అన్నట్టుగా కథనంలో పేర్కొంది. ఇక, ఈ వార్తాకథనంలో ప్రస్తావించిన అన్ని అంశాలనూ రుజువు చేయడానికి తగిన పత్రాలు తమ వద్ద ఉన్నట్టుగా The News Minute వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios