సుధీర్ రెడ్డికి కాంగ్రెస్‌లోకి ఆహ్వానం: సముచిత గౌరవం కల్పిస్తానన్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ లో చేరాలని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో సుధీర్ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుధీర్ రెడ్డికి రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే ఎం. సుధీర్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం నాడు ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుధీర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. సుధీర్ రెడ్డి తనయుడు శరత్ మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు.
తండ్రీ కొడుకులను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. వారిని మనస్పూర్తిగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు. తనను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడంలో నియోజకవర్గ ప్రజల శ్రమ ఉందన్నారు. పాలు అమ్ముకునే వాడొకడు... సీట్లు అమ్ముకొనేవాడొకడని మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామ, అల్లుళ్లకు బుద్ది చెప్పి నన్ను ఎంపీగా గెలిపించారని ఆయన గుర్తు చేశారు.
ఇక్కడి ప్రజలకు ఈ ప్రాంతానికి తాను ఎంతో రుణపడి ఉన్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉందన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి విముక్తి కల్పించే బాధ్యత తనదన్నారు.
also read:మేడ్చల్ లో బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే...
అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్ గా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. మెట్రో రైలును ఈ ప్రాంతానికి పొడగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.టికెట్ రానివారి ఆవేదనను తాను అర్ధం చేసుకోగలనన్నారు. ఎవరిపై తనకు ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. ముందున్న లక్ష్యాన్ని చూడాలని ఆయన కోరారు.కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.