తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ చిత్ర పరిశ్రమలో ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారో అందరికీ తెలుసునంటూ రేవంత్ కామెంట్ చేశారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఒక పరిపక్వత లేని, బాధ్యత లేని, జూలాయి మంత్రని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ చిత్ర పరిశ్రమలో ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారో అందరికీ తెలుసునంటూ రేవంత్ కామెంట్ చేశారు. దర్శకుడు నర్సింగరావు అలాంటి వ్యక్తి కాకపోవడం వల్లే కేటీఆర్ ఆయనను కలవడం లేదని రేవంత్ చురకలంటించారు. తెలంగాణ కవులు, కళాకారులను అవమానించడం సరికాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారని రేవంత్ ప్రశ్నించారు.
గాంధీ భవన్‌లో టీ.కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు. రాబోయే ఐదు నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా గర్జనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దశాబ్ధి దగా పేరుతో ఈ నెల 22న నిరసనలు చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ రోజున రావణాసురుడి గెటప్‌లో కేసీఆర్ ఫోటోకి పదితలలు పెట్టి దిష్టిబొమ్మను దగ్థం చేస్తామని ఆయన తెలిపారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర ఖమ్మంలో ముగుస్తుందని.. ఈ సందర్భంగా జాతీయ నాయకులతో సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దర్శకుడు బీ నర్సింగరావుకు కేసీఆర్, కేటీఆర్‌లు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. నర్సింగరావు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తని.. ఆయన తీసిన సినిమాల్లో తెలంగాణ పరిస్థితులను , సంస్కృతిని తెలియజేశారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. అలాంటి వ్యక్తికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ వైఖరి మార్చుకుని ఇప్పటికైనా ఆయనను కలవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన కుప్పకూలిందని.. బీసీ కేటగిరీలో వున్న అన్ని కులాలు, ఉప కులాలకు లక్ష రూపాయల పథకం అమలు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరవీరులు, ఉద్యమకారులంటే కేసీఆర్‌కు చిన్న చూపని.. వాళ్లంటే ఆయనకు అసూయ, ద్వేషమని రేవంత్ వ్యాఖ్యానించారు. చివరికి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉద్యమకారులకు ఇలాంటి అవమానం జరగలేదన్నారు. మోడీ నాకు మిత్రుడు, ఇద్దరం కలిసి ఆలోచనలు పంచుకుంటామని కేసీఆర్ చెప్పారని రేవంత్ దుయ్యబట్టారు. ఢిల్లీలో బీజేపీ, హైదరాబాద్‌లో కేసీఆర్ వుండాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ , కేసీఆర్ వ్యాఖ్యలతో వాళ్లిద్దరూ ఒక్కటేనని స్పష్టత వచ్చిందన్నారు.
ధరణిని, బీఆర్ఎస్ పథకాలను కొనసాగిస్తామని చెప్పడం ఎందుకు.. కేసీఆర్‌నే కొనసాగిస్తామని బండి సంజయ్ చెప్పాల్సిందని రేవంత్ ఎద్దేవా చేశారు. దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని చేయాలంటూ మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపైనా రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది అంత ఆషామాషీ కాదని, దీనిపై పార్టీలో అందరితో కలిసి చర్చిస్తామన్నారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయితే ఆదాయం కేంద్రానికి పోతుందని.. అప్పుడు తెలంగాణ చేతిలో చిప్ప మిగులుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
