తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వేళ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణాల్లో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు .
తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెక్రటేరియట్ అధికారిక కార్యక్రమమని.. కానీ ఎక్కడ ప్రోటోకాల్ పాటించలేదన్నారు. గతంలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవంలోనూ ఇలాగే నిబంధనలు పాటించలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరినీ గౌరవించేవాళ్లమని ఆయన గుర్తుచేశారు.
కేసీఆర్ తన సొంత కార్యక్రమంలో సచివాలయ ప్రారంభోత్సవం చేశారని రేవంత్ ఫైర్ అయ్యారు. గవర్నర్‌ను కూడా దూరంగా వుంచారని.. విపక్షాలను సైతం ఆహ్వానించలేదని ఆయన దుయ్యబట్టారు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణాల్లో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ జరుపుతామని , దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ALso Read: తెలంగాణ సచివాలయం మసీదు రూపంలో ఉన్నదన్న బీజేపీ.. నెటిజన్లు ఏమన్నారంటే?
అంతకుముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సచివాలయ నిర్మాణంతోనైనా కేసీఆర్ సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. సచివాలయ నిర్మాణ ఖర్చు పేరుకు వెయ్యి కోట్లు అని చెబుతున్నారని.. కానీ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని ఆయన విమర్శించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. పేదలకు ఇళ్లు, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా సచివాలయం నిర్మించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
కాగా.. తెలంగాణ నూతన సచివాలయాన్ని ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన కార్యాలయానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ముందుగా నిర్ణయించిన సుముహుర్తానికి కుర్చీలో ఆసీనులైనారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆరు దస్త్రాలపై సుముహుర్తంలోనే సంతకాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రంపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఫైల్స్‌పై సంతకం చేసిన అనంతరం వేద పండితులు కేసీఆర్‌కు ఆశీర్వచనాలు అందించారు.
