ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదా? సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
Revanth Reddy: వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ లో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వర్షాలు, వరదలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఉప్పల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కార్ తీరుపై విరుచుకపడ్డారు. వరద ముప్పు పై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు వరదలతో అల్లాడుతుంటే కేటీఆర్ బర్త్ డే పార్టీల్లో మునిగిపోయారనీ, వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇక సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల ప్రాణాలపైనా లేదని విమర్శించారు. వరదల వల్ల 30మంది చనిపోయినా కేసీఆర్ ఎందుకు పరామర్శించేందుకు రాలేదనీ నిలాదీశారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ ప్రజల ప్రాణాలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరప్రజలు నరకం చూస్తుంటే.. కేసీఆర్ అండ్ కో ఎన్నికల వ్యూహంలో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. జనం ఓట్లు తప్ప వాళ్ల పాట్లు కేసీఆర్ కు పట్టడం లేదనీ, బాధ్యత లేని సర్కారును ఫాంహౌస్ కు సాగనంపితే తప్ప తమ కష్టాలు తీరవని నగరవాసులు భావిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. జనం మనోభిష్టాన్ని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందనీ, తండ్రీ కొడుకులు ప్రజల ప్రాణాలు పూచీక పుల్లతో సమానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు సాయం చెయ్యాలని, వారికి వెంటనే ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో రూ.600 కోట్లు వరద సాయం చేశామని చెప్పి సగం దోచుకున్నారని ఆరోపించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని, ప్రతి ఎకరానికి 30వేల సాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అలాగే.. ఇసుక మేటలు తొలగించడానికి రూ.20వేల సాయం చెయ్యాలనీ, అడ్డా మీద కూలీలను గుర్తించి వారి కూడా సాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. బీజేపీ, కేంద్రప్రభుత్వం పై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్ర సాయం కూడా వెంటనే విడుదల చెయ్యాలనీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే రూ.1000 కోట్లు తీసుకురావాలని,రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఖచ్చితంగా ఉందని అన్నారు.