Asianet News TeluguAsianet News Telugu

ఏ కుంభకోణంలోనైనా నా వాళ్లుంటే ఉరి తీయండి: రేవంత్ రెడ్డి

రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో మత విద్వేషాలు కల్గించేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

TPCC Chief Revanth Reddy Fires on BJP
Author
Hyderabad, First Published Aug 24, 2022, 8:35 PM IST

హైదరాబాద్:ఏ కుంభకోణంలోనైనా తన కుటుంబ సభ్యులుంటే ఉరి తీయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు. తాను ఏదైనా విషయంపై మాట్లాడితే నా బంధువులు , కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏ కుంభకోణంలోనైనా తన వాళ్లుంటే వారిని ఉరి తీయాలని రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం నాడు రాత్రి గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

ఎక్సైజ్ స్కాంలో నా బంధువున్నా తమ్ముడున్నా ఉరి తీయాలని రేవంత్ రెడ్డి కోరారు. డ్రగ్స్ లో నా మేనల్లుడు ఉన్నాడని చేసిన వ్యాఖ్యను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రక్త నమూనాలు ఇవ్వండని అంటే ఎవరూ కూడా ముందుకు రాలేదన్నారు.ఫినిక్స్ రియల్ ఏస్టేట్ కంపెనీ బినామీలను ఐటీ అధికారులు బయల పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఐటీ దాడులు చేస్తున్నా బినామీలు ఎవరన్నది ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలన్నారు.కేసీఆర్ కుటుంబ సభ్యులకు వాటాలున్నాయా అని అడిగారు. అందుకే బినామీలను దాస్తున్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ లబ్ది కోసం  రాష్ట్రంలో బీజేపీ  మత విద్వేషాలు కల్గించే ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. .తెలంగాణలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పరిస్థితులున్నాయన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోసల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవినీతికి దూరంగా ఉన్న పార్టీలకు వ్యక్తులకు ఆప్ దూరంగా ఉంటుందని తాము నమ్మామన్నారు. గతంలో అవినీతికి వ్యతిరేకంగా సాగిన ర్యాలీల్లో ఆప్ నేతలు పాల్గొన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ , మహారాష్ట్రలలో ఎన్నికలు జరిగిన సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆర్ధికంగా సహాయం చేసిందనే చర్చ జరిగిందని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అక్రమంగా సంపాదించిన సొమ్ములో వందల కోట్లను ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు కేసీఆర్ ఇచ్చారనే ఆరోపణలున్నాయన్నారు. ఏపీ రాష్ట్రంలోని వారికి కూడా డబ్బులు ఇచ్చారనే ఆరోపణలున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ ప్రచారంలో ఉన్న వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విచారణ సంస్థలు ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వచ్చిన సమయంలో సీబీఐ, ఈడీ అధికారులు కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఎందుకు సోదాలు చేయలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ ఈ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉంటే ఆధారాలను మాయం చేసేందుకు అవకాశం ఉంది కదా అని రేవంత్ రెడ్డి అడిగారు.ఆప్ పార్టీకి  ఆర్ధిక సహాయం అందిస్తే కేసీఆర్ కు తెలియకుండానే సహాయం చేస్తారా అని రేవంత్ రెడ్డి అడిగారు. 

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ, సీబీఐ అధికారులు ఎందుకు సోదాలు చేయడం లేదో చెప్పాలన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్, మంత్రులను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీకి కేసీఆర్ ఆర్ధిక సహాయం చేశారనే ప్రచారం కూడా ఉందన్నారు. మతం పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీచర్యను ప్రతి పౌరుడు ఖండించాలని రేవంత్ రెడ్డి కోరారు.తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని ప్రియాంక గాంధీ ప్రకటించారని చెప్పారు.తెలంగాణపై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన చెప్పారు.ఈ నెలాఖరుకు మునుగోడు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios