Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే ఓఆర్ఆర్ లీజు: రేవంత్ రెడ్డి


 ఔటర్ రింగ్  రోడ్డు  లీజు  విషయమై చోటు  చేసుకున్న  అవకతవకలపై  కేంద్రం ఎందుకు  విచారణ  జరిపించడం లేదని  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. 

TPCC  Chief  Revanth Reddy Demands  To  Probe  On  ORR  Lease  lns
Author
First Published May 26, 2023, 5:01 PM IST

హైద్రాబాద్:ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహలోనే  హైద్రాబాద్  ఔటర్ రింగ్  రోడ్డు  కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.ఔటర్ రింగ్  రోడ్డు  లీజు  కాంట్రాక్టు  దక్కించుకున్న  ఐఆర్ బీ సంస్థ   30  రోజుల్లో   25 శాతం  చెల్లించాలని   కాంట్రాక్టు  నిబంధనలున్నాయని  రేవంత్ రెడ్డి  చెప్పారు.   ఈ నిబంధన లేదని  చెబితే  కొత్త  నిబంధన  ఏముందో  చెప్పాలని  రేవంత్ రెడ్డి  అధికారులను ప్రశ్నించారు. 

ఐఆర్‌బీ సంస్థకు  హెచ్ఎండీఏ  లెటర్ ఆఫ్ అగ్రిమెంట్  ఇచ్చిందని  రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంట్రాక్టు దక్కించుకున్న ఐఆర్‌బీ సంస్థ  ఇప్పటివరకు  ఒక్క రూపాయిని  కూడా చెల్లించలేదని  రేవంత్ రెడ్డి గుర్తు  చేశారు.  టెండర్ దక్కించుకున్న సంస్థ  నెలరోజుల్లో  25 శాతం చెల్లించాలన్న నిబంధన లేదని  అధికారులు  తప్పుదోవ పట్టించే  ప్రయత్నం  చేస్తున్నారని రేవంత్ రెడ్డి   మండిపడ్డారు. 30  రోజుల నిబంధనపై  మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఏం చెబుతారని  ఆయన  ప్రశ్నించారు. 

రూలక్ష కోట్ల విలువైన  ఔటర్ రింగ్  రోడ్డును   రూ. 7 వేల కోట్లకు  తెగనమ్మారని  ఆయన  ఆరోపించారు.  ఔటర్ రింగ్  రోడ్డు లీజు స్కాంపై  మంత్రి కేటీఆర్ స్పందించాలని  ఆయన  డిమాండ్  చేశారు.  విదేశీ పర్యటనలో  ఉన్న కేటీఆర్ కు  తీరిక లేకపోతే  మున్సిపల్ శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ   అరవింద్ కుమార్  స్పందించాలని  రేవంత్  రెడ్డి  కోరారు. ఈ అగ్రిమెంట్ లోని అంశాలను  రేవంత్ రెడ్డి  చదివి విన్పించారు. 

ఔటర్ రింగ్  రోడ్డు స్కాంపై  కేంద్రం  ఏం  చేస్తుందని  ఆయన  ప్రశ్నించారు. ఔటర్ రింగ్  రోడ్డు స్కాంపై   కేంద్రం  ఎందుకు  విచారణ చేయడం లేదని ఆయన  ప్రశ్నించారు.   తాను  చేసిన  ఆరోపణలపై   బీఆర్ఎస్, బీజేపీలు  వివరణ  ఇవ్వాలని రేవంత్ రెడ్డి  డిమాండ్  చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రూ. 100  కోట్లు  ముడుపులు తీసుకున్నారనే విషయమై   ఈడీ, సీబీఐ  విచారణ చేస్తుందన్నారు. ఈ  కేసులో  పలువురిని  అరెస్ట్  చేశారని ఆయన  గుర్తు  చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం తరహ లాంటి  ఔటర్ రింగ్  రోడ్డు  కేసు విషయమై   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంందుకు  మాట్లాడడం లేదో  చెప్పాలన్నారు. ఔటర్ రింగ్  రోడ్డు  లీజు స్కాంలో  ఈడీ, సీబీఐ విచారణలు  ఎందుకు  జరగడం లేదని  ఆయన  ప్రశ్నించారు. 

also read:ఔటర్ రింగ్ రోడ్డు లీజులో అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు : రేవంత్ రెడ్డి

ఐఆర్‌బీ సంస్థకు  ఔటర్ రింగ్  రోడ్డును  తెగనమ్మారని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు.  ఔటర్ రింగ్  రోడ్డు  లీజు విషయంలో  చోటు  చేసుకున్న  అవకతవకలపై   విచారణ  చేయాలని  కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు  అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios