మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కులం నుంచి బహిష్కరించాల్సిందిగా కమ్మ కుల పెద్దలను కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మమతా కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar) అక్రమాలపై సీబీఐ (cbi) విచారణ జరపాలని డిమాండ్ చేశారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . ఈడీ కేసులు, చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు, మమతా కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు రేవంత్. దమ్ముంటే పువ్వాడే సీబీఐ విచారణ కోరాలని రేవంత్ డిమాండ్ చేశారు. మరోవైపు పువ్వాడను కులం నుంచి బహిష్కరించాలని కమ్మ పెద్దలను కోరారు రేవంత్. కేసీఆర్ (kcr) జీతగాళ్లలాగా పనిచేస్తూ .. కాంగ్రెస్ (congress) కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లను డైరీలో నమోదు చేస్తున్నామని.. వారందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవేళ అధికారులు రిటైర్ అయిపోయినా మిమ్మల్ని పట్టుకొచ్చి.. శిక్ష విధిస్తామని రేవంత్ అన్నారు. కేసీఆర్ అంతానికి.. పువ్వాడ పతనానికి సమయం దగ్గరపడిందని ఆయన జోస్యం చెప్పారు. 

మరోవైపు .. రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ (nalgonda) పర్యటన వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం.. ఆయన బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే రేవంత్ పర్యటన వాయిదా పడినట్టుగా నల్గొండ డీసీసీ తెలిపింది. రేవంత్ పర్యటన తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు (komatireddy venkat reddy) వ్యతిరేకించడంతోనే రేవంత్ జిల్లా పర్యటన వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. 

ఇక, మే 6వ తేదీన వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ (rahul gandhi) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం.. కరీంనగర్‌లో పర్యటించారు. ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన నాయకుల, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. వరంగల్‌లో నిర్వహించే రైతు సంఘర్షణ సభను విజయంతం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. 

అయితే ఖమ్మంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల తొలగింపు వివాదం చోటుచేసుకుంది. రేవంత్ ఖమ్మం రానున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రేవంత్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆవేశంలో కొందరు కార్యకర్తలు అధికారుల వాహనాలపై దాడి చేయడంతో.. అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి.